
అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో తలపడ్డారు.
45 నిమిషాలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన మూడు సెట్ల పోరులో వివేక్ 15-12, 9-15, 15-11 తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా కీలక సమయంలో పట్టుదలతో ఆడి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. సింగిల్స్‌లో స్వర్ణంతో పాటు వివేక్ రెడ్డి డబుల్స్‌లోనూ తన ప్రతిభను చాటారు. 40+ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన శ్రీకర్ మోతుకూరితో కలిసి బరిలోకి దిగారు. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అలెక్సిస్ పెటిప్రెజ్, చిలీకి చెందిన రోడ్రిగో హెర్నాండెజ్ జోడీపై 21-19 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
ఆగస్టు 30న ప్రారంభమైన ఈ పోటీులు సెప్టెంబర్ 6 వరకు డా నాంగ్‌లో జరగనున్నాయి. ఈ ప్రపంచ కప్‌లో 80కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి 4,900 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆసియాలో తొలిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ జరుగుతుండగా.. మొత్తం ప్రైజ్ పూల్ 5 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉంది.
వివేక్ రెడ్డి గతంలో జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడిగా రాణించారు. అనంతరం పికిల్‌బాల్‌లోకి అడుగుపెట్టి జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌లో పికిల్‌బాల్‌కు ఆదరణ వేగంగా పెరుగుతున్న సమయంలో ఆయన సాధించిన విజయం ఈ క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది. భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గర్వంగా ఉందని వివేక్ రెడ్డి తెలిపారు. తన విజయం యువతను పికిల్‌బాల్ వైపు ఆకర్షించి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రపంచ కప్‌లో స్వర్ణం, కాంస్యం సాధించిన వివేక్ రెడ్డి.. అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్ పేరును మరోసారి నిలబెట్టారు.