Glenn Maxwell: బ్యాట్ పట్టి క్రీజులోకి వచ్చాడంటే.. ఎంతటి స్టార్ బౌలర్‌కి అయినా స్టార్లు కనిపించేలా చేయగల గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్వయంగా చుక్కల్లో తేలిపోతున్నాడు. అవును, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు మ్యాక్సీ సతీమణి విని రామన్ తన ఇన్‌స్టా ద్వారా తన భర్తను టాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో విని రామన్ ‘మ్యాక్స్‌వెల్, నేను ఈ సెప్టెంబర్ నాటికి రెయిన్‌బో బిడ్డకు జన్మనివ్వబోతున్నాం. ఈ విషయాన్ని అందరీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం మాకు అంత తేలికగా సాగలేదు. మొదటిసారి బిడ్డను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డాం. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు మా ప్రేమను తెలియజేస్తున్నాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇక భారత సంతతికి చెందిన విని రామన్‌ను ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్సీ గతేడాది మార్చి నెలలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా విని రామన్ పెట్టిన పోస్ట్‌పై అటు క్రికెట్ అభిమానులు, ఆర్‌సీబీ ఫ్యాన్స్, ఇటు భారతీయ నెటిజన్స్ మ్యాక్సీ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రెయిన్ బో బేబీ అంటే..
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ‘రెయిన్ బో బేబీ’ పదానికి అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తాాజాగా విని రామన్ కూడా తమకు పుట్టబోయేది ‘రెయిన్ బో బేబీ’ అని మెన్షన్ చేయడంతో ఈ పదం అందరినీ ఆకర్షించింది. రెయిన్ బో బేబీ అంటే.. సదరు బేబీకి జన్మనివ్వబోయే తల్లికి గతంలో గర్భస్రావం కారణంగా లేదా ఏదైనా కారణం వల్ల స్త్రీ గర్భంలోనే శిశువు మరణిస్తే వారి తర్వాత పుట్టే బిడ్డను రెయిన్ బో బేబీ అంటారు. అంటే మ్యాక్సీ-రామన్ జంటకు ఇదివరకే బిడ్డ జన్మించాల్సి ఉన్నా ఏదైనా కారణాల వల్ల గర్భస్రావం అయి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాపై గతంలో రామన్ గానీ మ్యాక్స్‌వెల్ గానీ గతంలో ఎవరికీ తెలియజేయలేదు.
కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో 34 ఏండ్ల మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరఫున కేజీఎఫ్(కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)లో భాగంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ.. 186.44 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు కూడా ఉండడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..