FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న చిన్న దేశం.. మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో మొరాకో మరోసారి తన సత్తా చాటుతోంది. ప్రపంచ స్థాయి అకాడమీలు, మౌలిక సదుపాయాలు, యూత్ డెవలప్‌మెంట్‌తో ఎదిగిన మొరాకో విజయగాథ నుంచి భారత ఫుట్‌బాల్ ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న చిన్న దేశం.. మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
Fifa World Cup 2026

Updated on: Jun 17, 2026 | 8:19 AM

FIFA World Cup 2026 : అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంలో మొరాకో దేశం సాధిస్తున్న విజయాలు ఈ దశాబ్దంలోనే అత్యంత అద్భుతమైన క్రీడా విజయాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 లో భాగంగా జూన్ 13న ఈస్ట్ రూథర్‌ఫర్డ్‌లో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో మొరాకో జట్టు.. ఫుట్‌బాల్ ప్రపంచ సామ్రాట్ బ్రెజిల్‌ను 1-1 తో నిలువరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్‌లో మొదట మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సాయిబారి గోల్ కొట్టి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించగా.. ఆ తర్వాత బ్రెజిల్ స్టార్ వినీషియస్ జూనియర్ తన వ్యక్తిగత నైపుణ్యంతో గోల్ చేసి బ్రెజిల్‌ను ఓటమి నుంచి కాపాడుకున్నాడు. గత 2022 వరల్డ్ కప్‌లోనే బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ వంటి ప్రపంచ అత్యుత్తమ జట్లను ఓడించి సెమీఫైనల్ చేరిన మొరాకోకు, బ్రెజిల్‌ను అడ్డుకోవడం పెద్ద వింతేమీ కాదు.

ఒకప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్దగా గుర్తింపు లేని మొరాకో.. ఈ స్థాయికి చేరడం వెనుక ఒక భారీ మాస్టర్ ప్లాన్ ఉంది. మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొన్నేళ్ల క్రితం దేశంలో ఒక సమగ్ర ఆధునీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త స్టేడియాలను నిర్మించడం, శిక్షణ సదుపాయాలను ప్రపంచ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం, విదేశీ నిపుణుల ద్వారా ప్రొఫెషనల్ కోచింగ్ పద్ధతులను ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంది. ఈ వ్యూహాత్మక ప్రణాళికే మొరాకోను నేడు ప్రపంచ ఫుట్‌బాల్‌ లో ఒక బలమైన శక్తిగా మార్చింది.

మొరాకో సాధించిన ఈ మహోన్నత విజయానికి ప్రధాన చిహ్నం మొహమ్మద్ VI ఫుట్‌బాల్ అకాడమీ. దేశంలో ఫుట్‌బాల్ క్రీడను అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2009లో కింగ్ మొహమ్మద్ VI ఈ అకాడమీని స్వయంగా ప్రారంభించారు. ఈ అకాడమీ కేవలం ఆటలోనే కాకుండా, క్రీడాకారులకు ఉన్నత విద్య, స్పోర్ట్స్ సైన్స్, అత్యుత్తమ వైద్య సదుపాయాలను కలిపి అందిస్తుంది. మొరాకో స్టార్ ప్లేయర్లు యుస్రా ఎన్-నెసిరి, నాయెఫ్ అగుర్డ్ వంటి వారు ఈ అకాడమీ నుంచి వచ్చినవారే. 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన జట్టులోని మెజారిటీ ప్లేయర్లు ఇక్కడి నుంచే శిక్షణ పొందారు. అంతేకాకుండా చిలీలో జరిగిన 2025 అండర్-20 వరల్డ్ కప్‌ను మొరాకో గెలవడంలో ఈ అకాడమీ విద్యార్థులే కీలక పాత్ర పోషించారు.

మొరాకో విజయాల వెనుక ఉన్న మరో స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే.. యూరప్‌ దేశాలలో స్థిరపడిన మొరాకో సంతతికి చెందిన ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించి, వారిని తమ జాతీయ జట్టు తరఫున ఆడేలా ప్రోత్సహించడం. నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ రైట్-బ్యాక్ ఆటగాడిగా పేరొందిన అచ్రాఫ్ హకీమి, స్టార్ ప్లేయర్లు హకీమ్ జియెచ్, నౌసైర్ మజ్రౌయి వంటి వారు స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలలో క్లబ్ క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుతూ కెరీర్‌ను ప్రారంభించారు. కానీ తమ మాతృదేశంపై ఉన్న గౌరవంతో మొరాకో జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి మొగ్గు చూపారు. ఈ వ్యూహం మొరాకోకు అంతర్జాతీయ అనుభవాన్ని తెచ్చిపెట్టింది.

మొరాకో చీఫ్ కోచ్ వాలిద్ రెగ్రాగుయ్ నేతృత్వంలో జట్టులో క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచన, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడే తత్వం అలవడ్డాయి. మొరాకో సంస్కృతిలో ఫుట్‌బాల్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఉద్వేగభరితమైన అభిమానులు మొరాకో లోనే ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉండే వైదాద్ ఏసీ, రాజా సీఏ వంటి క్లబ్ మ్యాచ్‌లను చూడటానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ వాతావరణం చిన్న పిల్లలను సైతం ఫుట్‌బాల్ స్టార్స్ కావాలని కలలు కనేలా చేస్తోంది. 2030లో స్పెయిన్, పోర్చుగల్ దేశాలతో కలిసి సంయుక్తంగా ఫిఫా వరల్డ్ కప్‌ను హోస్ట్ చేయబోతున్న మొరాకో.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై మరిన్ని నిధులు కుమ్మరిస్తోంది.

మొరాకో సాధించిన విజయాల నుంచి భారతదేశం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కేవలం నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను వెతకడమే కాకుండా.. మొరాకో లాగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నేషనల్ అకాడమీలను స్థాపించడం భారత్‌కు ఎంతో అవసరం. కేవలం ఒకట్రెండు మ్యాచ్‌లు గెలిచి మాయమైపోయే జట్లలా కాకుండా, మొరాకో లాగా బలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యూత్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను ఇండియా అమలు చేయాలి. ప్రస్తుతం 2026 వరల్డ్ కప్‌లో ఆడుతున్న మొరాకో జట్టులో కెప్టెన్ అచ్రాఫ్ హకీమి, గోల్ కీపర్ యాసిన్ బౌను, టెక్నికల్ అటాకర్ బ్రాహిమ్ డియాజ్ వంటి సీనియర్లతో పాటు 18 ఏళ్ల అద్భుత మిడ్‌ఫీల్డర్ అయ్యూబ్ బౌవాద్ది వంటి యంగ్ టాలెంట్ కలగలిసి ఉన్నారు. భారతదేశం కూడా క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు ఫుట్‌బాల్‌లోనూ ఇలాంటి దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులు చేస్తే.. రాబోయే రోజుల్లో బ్లూ టైగర్స్ కూడా ఫిఫా వరల్డ్ కప్ వేదికపై గర్జించడం అసాధ్యమేమీ కాదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us