FIFA World Cup 2026 : ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్ సామాన్లు చోరీ.. గంగలో కలిసిన అమెరికా పరువు

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ప్రాక్టీస్ సామాన్లు కాన్సాస్ సిటీకి తరలిస్తుండగా చోరీకి గురయ్యాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఎక్కువ భాగం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అమెరికా భద్రతా ఏర్పాట్లపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

FIFA World Cup 2026 : ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్ సామాన్లు చోరీ.. గంగలో కలిసిన అమెరికా పరువు
Fifa World Cup 2026

Edited By:

Updated on: Jun 15, 2026 | 12:54 PM

FIFA World Cup 2026 : ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా పండగ ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 ప్రారంభమైంది. ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) కలిసి ఉమ్మడిగా ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే, టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాలో అనేక వివాదాలు రేగుతున్నాయి. ఇప్పటికే క్రీడాకారుల కఠినమైన సెక్యూరిటీ చెకింగ్స్, ఇరాన్ మ్యాచ్ టికెట్ల వివాదాలు, ఎయిర్‌పోర్టులలో ఆటగాళ్లు, రెఫరీలను గంటల తరబడి విచారించడం వంటి సంఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా భద్రతా విఫలత్వాన్ని ఎత్తిచూపేలా మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

టోర్నమెంట్‌లో తమ మొదటి మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న స్టార్ టీమ్ ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టుకు అమెరికాలో ఊహించని షాక్ తగిలింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు తన మొదటి మ్యాచ్‌ను జూన్ 18, గురువారం నాడు టెక్సాస్ వేదికగా క్రొయేషియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం గత కొన్ని రోజులుగా ఇంగ్లాండ్ జట్టు ఫ్లోరిడాలో బస చేసి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం శనివారం నాడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కాన్సాస్ సిటీకి చేరుకోవాల్సి ఉంది. అయితే వారు రాకముందే.. వేరే వాహనాలలో పంపించిన వారి అత్యవసర ప్రాక్టీస్ సామాన్లు దారిలోనే మాయమయ్యాయి.

బీబీసీ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించిన సామాన్లను ఫ్లోరిడా నుంచి కాన్సాస్ సిటీకి రోడ్డు మార్గంలో లారీల ద్వారా తరలిస్తుండగా ఈ చోరీ జరిగింది. సామాన్లు కాన్సాస్ సిటీకి చేరుకున్నాక పరిశీలించగా.. అందులో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు కనిపించలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించబడిన సామాన్లలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన బూట్లు, ఫుట్‌బాల్స్, నెట్స్, కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన అత్యంత విలువైన కిట్లు ఉన్నట్లు సమాచారం.

ఈ హై-ప్రొఫైల్ దొంగతనంపై అమెరికా పోలీసులు అత్యంత వేగంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. స్కాన్ న్యూస్ నివేదికల ప్రకారం.. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, దొంగతనానికి గురైన ఇంగ్లాండ్ జట్టు వస్తువులలో మెజారిటీ సామాన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఈ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఒక స్టార్ జట్టు వస్తువులే దొంగతనానికి గురికావడం అమెరికా ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. ఒకవైపు ఫిఫా స్టేజీపై బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన డ్యాన్స్‌తో ప్రపంచ దేశాల లైమ్‌లైట్‌ను ఆకర్షించినా.. మరోవైపు ఈ దొంగతనం ఘటన అమెరికా భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలను ఎండగట్టింది. మెస్సి, రొనాల్డో లాంటి స్టార్ ప్లేయర్లు తమ మొదటి మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫుట్‌బాల్ అభిమానులు, అంతర్జాతీయ క్రీడా సంఘాలు అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us