FIFA World Cup 2026 : ఫిఫా చరిత్రలో ఎన్నడూ లేని వివాదం.. ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇరాన్ అభిమానుల టికెట్లను అమెరికా రద్దు చేయడంతో భారీ వివాదం చెలరేగింది. ఫిఫా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఇరాన్ జట్టు మద్దతు లేకుండానే మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.

FIFA World Cup 2026 : ఫిఫా చరిత్రలో ఎన్నడూ లేని వివాదం.. ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
Fifa World Cup 2026

Updated on: Jun 09, 2026 | 5:23 PM

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 23వ ఎడిషన్ ప్రారంభానికి కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఈ మెగా ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టోర్నమెంట్ కిక్‌ఆఫ్‌కు ముందే ఒక పెద్ద అంతర్జాతీయ వివాదం తెరపైకి వచ్చింది. తమ దేశానికి చెందిన ఫుట్‌బాల్ అభిమానుల మ్యాచ్ టికెట్లను ఆతిథ్య దేశమైన అమెరికా రద్దు చేసిందని ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను అమెరికా సహా మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

రాజకీయ కక్ష సాధింపు చర్యలా?

ఇరాన్, మెరికా దేశాల మధ్య ఉన్న పాత రాజకీయ వివాదాల కారణం గానే అమెరికా కావాలని ఇరాన్ ప్రేక్షకులను స్టేడియాల్లోకి రాకుండా అడ్డుకుంటోందని ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, “వరల్డ్ కప్ ప్రారంభానికి సరిగ్గా రెండు రోజుల ముందు అమెరికా తన కుట్ర బుద్ధిని చాటుకుంది. గ్రూప్ స్టేజ్ లో ఇరాన్ ఆడబోయే మూడు మ్యాచ్‌ల వేదికల వద్దకు మా దేశ సపోర్టర్లు రాకుండా తీవ్రమైన ఆటంకాలు సృష్టిస్తోంది” అని ఇరాన్ ఫెడరేషన్ మండిపడింది.

విమానాశ్రయంలో ఆటగాడి నిర్బంధం

అమెరికా కేవలం ఇరాన్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇతర దేశాల ఆటగాళ్లను కూడా ఇబ్బంది పెడుతోందని నివేదికలు చెప్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఇరాక్ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ఒక ముఖ్యమైన ఆటగాడిని అమెరికా ఎయిర్‌పోర్టులో అక్కడి భద్రతా సిబ్బంది అకారణంగా డిటైన్ చేశారు. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాతే అతడిని దేశంలోకి అనుమతించారు. దీనికి తోడు, ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు సహాయకారిగా ఉండాల్సిన కొందరు కీలక సపోర్ట్ స్టాఫ్ సభ్యులకు కూడా వీసాలు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిందని, కావాలనే పరిపాలనాపరమైన అడ్డంకులు సృష్టిస్తోందని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఫిఫా నిబంధనల ఉల్లంఘన

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) నిబంధనల ప్రకారం.. వరల్డ్ కప్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన మొత్తం టికెట్లలో 8 శాతం కోటాను ఆయా మ్యాచ్‌లు ఆడే దేశాల ఫెడరేషన్లకు కేటాయించాలి. ఆయా దేశాల బోర్డులు ఈ టికెట్లను తమ దేశంలోని అభిమానులకు విక్రయించుకుంటాయి. ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా ఫిఫా నిబంధనల ప్రకారమే అమెరికాలో జరగబోయే తమ గ్రూప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలను అధికారికంగా ప్రారంభించింది. అయితే అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరాన్‌కు దక్కాల్సిన ఆ 8 శాతం టికెట్ల కోటాను అకస్మాత్తుగా వెనక్కి తీసుకుంది.

మద్దతు లేకుండానే బరిలోకి ఇరాన్ జట్టు

అమెరికా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ప్రస్తుతం ఇరాన్ ఫుట్‌బాల్ బోర్డు తమ దేశ అభిమానులకు ఒక్క టికెట్ కూడా కేటాయించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. దీంతో స్టేడియంలో తమ దేశ జెండాలతో మద్దతు తెలిపే ప్రేక్షకులు లేకుండానే ఇరాన్ జట్టు ఆడాల్సి వచ్చేలా ఉంది. కాగా, ఈసారి వరల్డ్ కప్‌లో ఇరాన్ జట్టు గ్రూప్ జిలో స్థానం సంపాదించింది. ఈ గ్రూప్‌లో ఇరాన్ తన తదుపరి మ్యాచ్‌ల్లో బలమైన బెల్జియం, ఈజిప్ట్, న్యూజిలాండ్ జట్లతో తలపడాల్సి ఉంది. మరి ఈ టికెట్ల వివాదంపై ఫిఫా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us