
డోపింగ్ ఉల్లంఘనల్లో భారత్ టాప్‌లో ఉంది. ఈ లెక్క మేం చెప్పడం లేదు.. తాజాగా WADA నివేదిక లో ఈ అంశం వెల్లడైంది. డోపింగ్ ఉల్లంఘనల విషయంలో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) విడుదల చేసిన 2024 టెస్టింగ్ ఫిగర్స్ రిపోర్ట్ ప్రకారం, 5 వేలకుపైగా డోపింగ్ పరీక్షలు నిర్వహించిన దేశాల్లో భారత్‌లోనే అత్యధిక సంఖ్యలో ఉల్లంఘనలు నమోదయ్యాయి.
ఈ పరిస్థితి భారత క్రీడారంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. WADA నివేదిక ప్రకారం, గత ఏడాది భారత్ మొత్తం 7,113 డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 6,576 యూరిన్ నమూనాలు, 537 రక్త నమూనాలు ఉన్నాయి. ఈ పరీక్షల్లో 260 నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. దీంతో భారత్‌లో డోపింగ్ పాజిటివిటీ రేటు 3.6 శాతంగా నమోదైంది. ఇది ప్రధాన దేశాలన్నింటిలోనూ అత్యధికంగా ఉండటం గమనార్హం.
భారత్‌లో కొనసాగుతున్న డోపింగ్ సమస్య, భవిష్యత్తులో 2036 ఒలింపిక్స్ ఆతిథ్య బిడ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) పరిశీలించే సమయంలో కీలక అంశంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠపై ఈ గణాంకాలు ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే, ఈ సంఖ్యలపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) వివరణ ఇచ్చింది. డోపింగ్ ఉల్లంఘనలు పెరిగినట్లు కనిపిస్తున్నా, అది డోపింగ్ వినియోగం పెరిగినందుకేగాక, భారత్‌లో పరీక్షల సంఖ్య పెరగడం, గుర్తింపు వ్యవస్థలు బలోపేతం కావడమే కారణమని నాడా స్పష్టం చేసింది. విస్తృత స్థాయిలో పరీక్షలు, కఠినమైన డిటెక్షన్ విధానాల వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని పేర్కొంది.
ఇదే సమయంలో 2023 గణాంకాలను పరిశీలిస్తే, ఆ ఏడాది భారత్ 5,606 డోపింగ్ పరీక్షలు నిర్వహించగా, 213 పాజిటివ్ ఫలితాలు నమోదయ్యాయి. అప్పట్లో పాజిటివిటీ రేటు 3.8 శాతంగా ఉండటం గమనార్హం. అంటే డోపింగ్ ఉల్లంఘనల శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం సంఖ్యలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మొత్తంగా డోపింగ్‌పై భారత్ మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అవగాహన కార్యక్రమాలు, క్రీడాకారులపై నిఘా, శిక్షణ వ్యవస్థల పటిష్టత ద్వారానే ఈ సమస్యను ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..