Saina Nehwal : పెళ్లైన ఏడేళ్ల తర్వాత షాకింగ్ ప్రకటన చేసిన బ్యాడ్మింటన్ స్టార్

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. దాదాపు 7 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికారు. ఎంతో మంది అభిమానించే స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోవడం బ్యాడ్మింటన్ ప్రపంచానికి ఒక బాధాకరమైన వార్త.

Saina Nehwal : పెళ్లైన ఏడేళ్ల తర్వాత షాకింగ్ ప్రకటన చేసిన బ్యాడ్మింటన్ స్టార్
Saina Nehwal

Updated on: Jul 14, 2025 | 7:06 AM

Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ప్రకటన చేశారు. తన భర్త పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఆదివారం, జూలై 13న, సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న ప్రకటన విడుదల చేసింది. దాదాపు 7 సంవత్సరాల వివాహబంధానికి సైనా, కశ్యప్ ముగింపు పలికారు. ఆదివారం రాత్రి సైనా నెహ్వాల్ ఒక షాకింగ్ ప్రకటన విడుదల చేసింది.. అందులో “కొన్నిసార్లు జీవితం మనల్ని వేర్వేరు దిశలలోకి తీసుకువెళ్తుంది. చాలా ఆలోచించి, పరిశీలించిన తర్వాత, పారుపల్లి కశ్యప్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా ఇద్దరి కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాం. మా జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని, ముందుకు సాగేటప్పుడు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకుని, గౌరవించినందుకు ధన్యవాదాలు.” అంటూ రాసుకొచ్చారు.

సైనా, కశ్యప్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి పెరిగారు. సైనా ఒలింపిక్ కాంస్యం, వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ళకు పైగా ప్రేమించుకున్న తర్వాత ఈ జంట 2018లో పెళ్లి చేసుకుంది.

పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచింగ్‌లోకి మారాడు. సైనా కెరీర్ చివరి సంవత్సరాలలో ఆమెకు కోచ్‌గా వ్యవహరించాడు. 2019 నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధును ఓడించినప్పుడు కశ్యప్ ఆమెకు కోచ్‌గా ఉన్నాడు. 2016 తర్వాత సైనా ఎదుర్కొన్న గాయాల నుంచి కోలుకోవడానికి కశ్యప్ ఆమెకు సహాయం చేశాడు. మైదానంలో, టోర్నమెంట్లలో కశ్యప్ సైనాకు వ్యూహాత్మక సలహాలు, సపోర్ట్ ఇస్తూ కనిపించేవాడు. సైనా చివరగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడింది. ఈ దిగ్గజ షట్లర్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. కశ్యప్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా స్పందించలేదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…