Video: సెల్ఫీ పిచ్చితో అభిమానుల దురుసు ప్రవర్తన.. ‘హిట్‌మ్యాన్’ రియాక్షన్ వైరల్.. ఏమన్నాడంటే..?

క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా అభిమానులు అతన్ని చూసేందుకు ఎగబడుతుంటారు. అయితే, ఇటీవల కొందరు యువ అభిమానులు రోహిత్ పట్ల కాస్త అతిగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Video: సెల్ఫీ పిచ్చితో అభిమానుల దురుసు ప్రవర్తన.. హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్.. ఏమన్నాడంటే..?
Rohit Sharma Video

Updated on: Jan 05, 2026 | 12:09 PM

Rohit Sharma: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కారులో రోహిత్ ప్రయాణిస్తోన్న సమయంలో ఇద్దరు యువ అభిమానులు అతని వద్దకు వచ్చారు. రోహిత్ తన కారు కిటికీలోంచి చేయి బయటపెట్టి అభిమానులకు అభివాదం చేస్తుండగా, వారిలో ఒకరు ముందుగా అతనితో కరచాలనం (Handshake) చేశారు. అయితే, వెనువెంటనే ఆ ఇద్దరు అభిమానులు రోహిత్ చేతిని బయటకు లాగి, అతనితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. వారి ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి చెందిన రోహిత్, వారిని హెచ్చరించి వెంటనే తన కారు కిటికీ అద్దాలను క్లోజ్ చేశారు.

ఇటీవలి ప్రదర్శన..

రోహిత్ శర్మ ఇటీవల ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగారు. సిక్కింపై జరిగిన మ్యాచ్‌లో 155 పరుగులతో విరుచుకుపడగా, ఉత్తరాఖండ్‌పై జరిగిన మ్యాచ్‌లో మాత్రం డకౌట్ అయ్యారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తరపున రోహిత్ ఆడనున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరపురాని 2025 ఏడాదిగా..

టీమిండియా మాజీ సారథికి 2025 సంవత్సరం అద్భుతంగా సాగింది. భారీగా పరుగులు సాధించడమే కాకుండా పలు రికార్డులను ఆయన బద్దలు కొట్టారు. రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక తన కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

సిక్సర్ల రికార్డు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన తొలి వన్డేలో రోహిత్ తన 352వ సిక్సర్ బాది, పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును అధిగమించారు. 2015 నుంచి అఫ్రిది పేరిట ఉన్న ఈ రికార్డును ‘హిట్‌మ్యాన్’ తుడిచిపెట్టేశాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో రోహిత్ ఖాతాలో 355 సిక్సర్లు ఉన్నాయి.

గణాంకాలు: 2025 ఏడాదిని రోహిత్ ఘనంగా ముగించారు. 14 ఇన్నింగ్స్‌ల్లో 50.00 సగటుతో, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 650 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 121 నాటౌట్.

రిటైర్మెంట్: గత ఏడాది మే నెలలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, తన సుదీర్ఘ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌కు ఘనంగా ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..