సాహా వివాదంలో మరో ట్విస్ట్.. వృద్ధిమాన్ నన్ను బెదిరించాడు, ఇదిగో సాక్ష్యం అంటూ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్..

|

Mar 06, 2022 | 8:09 AM

Journalist Boria Majumdar vs Wriddhiman Saha: వృద్ధిమాన్ సాహా శనివారం నాడు బీసీసీఐ విచారణ కమిటీ ముందు ఈ విషయంలో తన వాదనను వినిపించాడు. ఎట్టకేలకు ఆ జర్నలిస్ట్ పేరును వెల్లడించాడు.

సాహా వివాదంలో మరో ట్విస్ట్.. వృద్ధిమాన్ నన్ను బెదిరించాడు, ఇదిగో సాక్ష్యం అంటూ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్..
Journalist Boria Majumdar Accuse Wriddhiman Saha
Follow us on

భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన కేసులో జర్నలిస్టు Wriddhiman Saha Journalist Threat) పేరు వెల్లడైంది. మార్చి 5, శనివారం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ విచారణ కమిటీ ముందు సాహా తన వాదనను సమర్పించాడు. ఎట్టకేలకు ఆ జర్నలిస్ట్ పేరు చెప్పాడు. అయితే ఆ తర్వాత సాహా ఆరోపించిన జర్నలిస్టు పేరును బహిరంగంగా చెప్పనప్పటికీ, సదరు జర్నలిస్టు సోషల్ మీడియాలో అసలు విషయాన్ని వివరించాడు. బోరియా మజుందార్ (Boria Majumdar), పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్.. యూట్యూబ్ షోలను నిర్వహిస్తున్నాడు. అతనే స్వయంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి తన పేరును సాహా పేర్కొన్నాడని తెలిపాడు. తమ మధ్య జరిగిన సంభాషణను సాహా తప్పుగా చిత్రీకరించాడని, భారత వికెట్ కీపర్‌కు పరువు నష్టం నోటీసు పంపుతానని మజుందార్ పేర్కొనడం విశేషం.

టీమిండియా నుంచి తొలగించిన తర్వాత.. సాహా ఫిబ్రవరి 19న ఒక ట్వీట్ చేశాడు. ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. సాహా ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఇది అతనికి, బోరియా మజుందార్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్. అయితే అందులో సాహా తన పేరును తీసుకోలేదు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సీనియర్ జర్నలిస్టు బోరియా మజుందార్ అయి ఉండొచ్చని ఊహాగానాలు వచ్చినా చాలా కాలంగా ఆయన పేరు కన్ఫర్మ్ కాలేదు.

సాహాపై ఆరోపణలు..
శనివారం, మార్చి 5, బోర్డు ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ముందు సాహా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అయితే, అర్థరాత్రి తరువాత బోరియా మజుందార్ స్వయంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాహా తన పేరును తీసుకున్నాడని, అతని వివరణను కూడా సమర్పించాడని చెప్పుకొచ్చాడు. మజుందార్ తన ట్వీట్‌లో ఇలా రాశారు. “ప్రతి కథకు ఎప్పుడూ రెండు పార్శ్వాలు ఉంటాయి. వృద్ధిమాన్ సాహా నా వాట్సాప్ చాట్‌ను తారుమారు చేసి, నా ప్రతిష్టకు, విశ్వసనీయతకు భంగం కలిగించాడు. న్యాయమైన విచారణ కోసం బీసీసీఐని అభ్యర్థించాను. నా లాయర్ వృద్ధిమాన్ సాహాకు పరువు నష్టం నోటీసు పంపుతున్నారు. న్యాయం గెలవాలి” అంటూ పేర్కొన్నాడు.

మజుందార్ తన వివరణలో ఏం చెప్పారు?
ఈ ట్వీట్‌తో పాటు, బోరియా మజుందార్ 9 నిమిషాల వీడియోను కూడా పోస్ట్ చేసి తన వివరణను సమర్పించారు. ట్వీట్ చేసిన 19వ తేదీన సాహాతో మాట్లాడలేదని చెప్పాడు. ఈ విషయాలన్నీ ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 13 తేదీలలో జరిగాయని, సాహా తన స్క్రీన్‌షాట్‌లో దాచిన తేదీలను కూడా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 వేలం సందర్భంగా ఇంటర్వ్యూకు సంబంధించి తనకు, సాహా మేనేజర్‌కు మధ్య చర్చ జరిగిందని, దీనికి సంబంధించి తాను 10వ తేదీన సాహాకు సందేశాలు పంపానని’ మజుందార్ పేర్కొన్నాడు.

IPL వేలం రెండవ రోజున సాహాను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అతను సాహాతో మాట్లాడి ఇంటర్వ్యూ అడిగానని మజుందార్ పేర్కొన్నాడు. మజుందార్ ప్రకారం, సాహా రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉంటానని, జూమ్ లింక్‌ను అతనికి పంపుతానని చెప్పాడు. తాను సాహాకు ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పలేదని, ఇంటర్వ్యూ చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని సదరు జర్నలిస్ట్ పేర్కొన్నాడు. సాహా తనకు చాలా కాలంగా తెలుసని, సమాధానం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినా బెదిరిపోలేదని మజుందార్ తెలిపాడు.

బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు..
ఈ వివాదంలో నిజాలను బయట పెట్టేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ముగ్గురు సభ్యలుతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సాహా వెల్లడించిన తర్వాత, కాంట్రాక్టు పొందిన ఆటగాడిని బెదిరించే విషయంలో బీసీసీఐ చర్య తీసుకుంటుందని హామీ ఇచ్చిందని బోర్డు ప్రకటించింది. ఈ కమిటీలో బోర్డు వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, కౌన్సిల్ టాప్ సభ్యుడు బల్తేజ్ సింగ్ ఉన్నారు. అయితే, తాజాగా జర్నలిస్ట్ వీడియో బయటకు రావడంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: IND vs SL: ఆ విషయంలో రోహిత్, ద్రవిడ్‌ల తప్పేం లేదు.. అసలేం జరిగిందంటే: విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జడ్డూ

IND vs PAK, LIVE Score, ICC Women’s World Cup 2022: హాఫ్ సెంచరీతో స్మృతి మంధాన దూకుడు.. 20 ఓవర్లకు స్కోరెంతంటే?