Women’s T20 World Cup : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సమరం షురూ.. ఫైనల్‌కు ఎక్కువ సార్లు చేరిన టాప్ టీమ్స్ ఇవే

Women's T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్లలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, భారత్ రికార్డులు ఆసక్తికరం. ఈసారి టోర్నీలో అన్ని బలమైన జట్లు కప్పు గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.

Womens T20 World Cup :  ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సమరం షురూ.. ఫైనల్‌కు ఎక్కువ సార్లు చేరిన టాప్ టీమ్స్ ఇవే
Women's T20 World Cup

Updated on: Jun 08, 2026 | 3:12 PM

Women’s T20 World Cup : క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ జూన్ 11 నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్‌లో ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ తన టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తుంటే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లు కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ టోర్నీ హిస్టరీలోనే ఇప్పటివరకు అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడి, లీడ్ లో ఉన్న జట్ల రికార్డులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఆస్ట్రేలియా లేడీస్ దే అల్టిమేట్ రికార్డ్

మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుది తిరుగులేని రికార్డు అని చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఏకంగా 7 సార్లు ఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. అందులో ఆరు సార్లు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. కేవలం 2016 లో మాత్రమే వెస్టిండీస్ జట్టు ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి షాక్ ఇచ్చింది. ఈసారి కూడా కంగారూ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

నాలుగు ఫైనల్స్‌తో ఇంగ్లాండ్ సెకండ్ ప్లేస్

ఆస్ట్రేలియా తర్వాత అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఇంగ్లీష్ టీమ్ మొత్తం నాలుగు సార్లు ఫైనల్స్ ఆడింది. అయితే వీరికి ఫైనల్స్‌లో బ్యాడ్ లక్ ఎక్కువగా నడిచింది. మూడు సార్లు ఫైనల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్, కేవలం 2009 లో మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. ముఖ్యంగా 2012, 2014, 2018 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలోనే ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూడటం గమనార్హం.

న్యూజిలాండ్, సౌతాఫ్రికాల ఫైనల్ ప్రయాణం

ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరింది. 2009, 2010లలో వరుసగా ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ గత 2024 వరల్డ్ కప్‌లో మాత్రం అద్భుత విజయంతో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. మరోవైపు సౌతాఫ్రికా జట్టు గత రెండు సీజన్లలోనూ (2023, 2024) వరుసగా ఫైనల్స్ ఆడినా.. దురదృష్టవశాత్తూ రెండు సార్లూ రన్నరప్‌గానే మిగిలిపోయింది.

భారత్, వెస్టిండీస్ జట్ల రికార్డులు ఇవే

టీమిండియా విషయానికి వస్తే, భారత మహిళల జట్టు ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే 2020లో ఫైనల్‌కు చేరింది. కానీ ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతోంది. కాబట్టి కచ్చితంగా ఫైనల్ చేరి తొలిసారి కప్పు గెలవాలనే పట్టుదలతో అమ్మాయిలు ఉన్నారు. ఇక వెస్టిండీస్ జట్టు 2016లో ఒకే ఒక్కసారి ఫైనల్ చేరి, ఆస్ట్రేలియాను ఓడించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us