IND vs NZ: ఫైనల్ గెలిస్తే రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్న బీసీసీఐ! ఎంచక్కా మరో రెండేళ్లు…

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు నడుస్తున్నాయి. భారత్ విజయం సాధిస్తే, బీసీసీఐ అతని కెప్టెన్సీని 2027 వరల్డ్‌కప్ వరకు పొడిగించవచ్చని సమాచారం. కానీ రోహిత్ రిటైర్మెంట్‌పై మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఫైనల్ అనంతరం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది!

IND vs NZ: ఫైనల్ గెలిస్తే రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్న బీసీసీఐ! ఎంచక్కా మరో రెండేళ్లు...
Bcci Offer To Rohit Sharma

Updated on: Mar 07, 2025 | 8:04 PM

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పలువురు క్రికెటర్లు వన్డేలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు ఇదే బాటలో రోహిత్ శర్మ కూడా ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతారా? అనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే, బీసీసీఐ రోహిత్ శర్మకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతోందని సమాచారం. ఫైనల్‌లో భారత్ విజయం సాధిస్తే, రోహిత్ కెప్టెన్సీని మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ కెప్టెన్‌గా కొనసాగవచ్చని అంటున్నారు.

అయితే ఈ విషయమై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ కలిసి ఒకసారి సమీక్షించనున్నారు. రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనదే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రోహిత్ కొనసాగుతారా? లేక వీడ్కోలు పలుకుతారా?

రోహిత్ శర్మ వచ్చే ఏప్రిల్‌లో 38 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. అంటే 2027 వన్డే ప్రపంచకప్‌ నాటికి 40 ఏళ్లు దాటుతారు. ఈ వయసులో కూడా వన్డే క్రికెట్‌ను కొనసాగిస్తారా? లేదా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా? అన్నది ఆయన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐసీసీ టోర్నీల్లో అరుదైన ఘనత సాధించిన ఏకైక కెప్టెన్

రోహిత్ శర్మ గతేడాది టీమిండియాను 2024 టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియాను చేర్చడం ద్వారా మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు.

రోహిత్ ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఘనత ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్‌కి దక్కలేదు.

ఫైనల్ తర్వాత రోహిత్ భవిష్యత్తు?

ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే, రోహిత్ కెప్టెన్సీ ఇంకొంతకాలం కొనసాగుతుందా? లేక రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మార్చి 9న ఫైనల్ తర్వాత బీసీసీఐ రోహిత్ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి