Andre Russell : లాస్ట్ మ్యాచ్ అని కాస్త జాలి చూపొచ్చుగా బ్రో.. రస్సెల్ ఓవర్లో చితకొట్టిన ఇంగ్లిష్

వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. జోష్ ఇంగ్లిస్ విధ్వంసకర బ్యాటింగ్ (78 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించింది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌కు ఘన సన్మానం లభించింది, అయితే అతని ఓవర్‌లో ఇంగ్లిస్ 16 పరుగులు రాబట్టాడు.

Andre Russell : లాస్ట్ మ్యాచ్ అని కాస్త జాలి చూపొచ్చుగా బ్రో.. రస్సెల్ ఓవర్లో చితకొట్టిన ఇంగ్లిష్
Andre Russell

Updated on: Jul 23, 2025 | 10:36 AM

Andre Russell : వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యం సాధించింది. రెండో టీ20లో వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 172 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించిన జోష్ ఇంగ్లిస్ 78 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆండ్రీ రస్సెల్ వేసిన ఒకే ఓవర్‌లో 16 పరుగులు సాధించాడు ఇంగ్లిస్. అదే ఓవర్‌లో సిక్స్ కొట్టి తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్‌కు బ్రాండన్ కింగ్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. అతను 36 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ పెద్ద హిట్స్ కొట్టడంలో విఫలమయ్యారు. ఆండ్రీ రస్సెల్ తనదైన శైలిలో 15 బంతుల్లో 36 పరుగులు (4 సిక్సర్లు, 2 ఫోర్లు) చేసి, జట్టు స్కోరును 172కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు మంచి ఓపెనింగ్ దక్కలేదు. ఓపెనింగ్‌కు వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ 10 పరుగులకే జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ కూడా 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. కానీ, ఆ తర్వాత కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ మరో వికెట్ పడకుండా 16వ ఓవర్‌లోనే ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు.

తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆండ్రీ రస్సెల్ 12వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ మొదటి బంతికే జోష్ ఇంగ్లిస్ సిక్స్ కొట్టి తన హాఫ్ సెంచరీని (22 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతి వైడ్ అవ్వగా, మూడో బంతికి ఇంగ్లిస్ మరో ఫోర్ కొట్టాడు. చివరి 3 బంతుల్లో 15 పరుగులు ఇచ్చిన తర్వాత, రస్సెల్ తర్వాతి 3 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. జోష్ ఇంగ్లిస్ 33 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు. కామెరూన్ గ్రీన్ కూడా 32 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 56 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఆండ్రీ రస్సెల్ ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభానికి ముందే రెండో మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతానని ప్రకటించాడు. జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగిన రెండో మ్యాచ్‌కు ముందు ఆండ్రీ రస్సెల్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి ఘనంగా సన్మానించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..