హర్యానా హరికేన్లు, లిటిల్ మాస్టర్లు, మిస్టర్ డిపెండబుల్సూ, సిక్సర్ల సిద్దూలు.. ఒకరేమిటి నలభై ఏళ్ల ప్రస్థానంలో చిన్నాపెద్దా చిచ్చరపిడుగులంతా కలిసి చరిత్ర పుస్తకాల్ని తిరగరాశారు.. తిరగరాస్తున్నారు. ఎవరస్టంత ఎత్తుకెక్కి ప్రపంచక్రికెట్ మీద మన జెండా పాతేశారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తా చాటుతూ తిరుగులేని మొనగాళ్లయ్యారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆటా మనదే. వేటా మనదే. క్రికెట్‌లోనే కాదు.. క్రికెట్ మీద జరిగే బిజినెస్‌లో కూడా మనమే టాపర్లం. క్రికెట్ నుంచి కోటానుకోట్ల కాసులు పిండుకోవడం ఎలా.. అనే విద్యను ప్రపంచానికి నేర్పినవాళ్లం కూడా మనమే. అల్టిమేట్‌గా.. మనల్నెవడ్రా ఆపేది.. అనే కాన్ఫిడెన్స్‌ను కూడగట్టుకున్నాం.
మన దేశంలో క్రికెట్ ఒక మతం. కోట్లాది మంది గుండెల్లో కొలువున్న అభిమతం. క్రికెట్‌ను తింటాం.. క్రికెట్‌ను తాగుతాం.. క్రికెట్‌ను ఆస్వాదిస్తాం.. క్రికెట్‌తోనే పండగ చేసుకుంటాం. మన ప్రభుత్వాలు కూడా మిగతా ఆటల కంటే క్రికెట్‌కే పెద్దపీటలేసుకుని ఆ క్రికెట్‌తోనే దేశ ప్రతిష్టను పెంచుకుంటాయ్. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కళ్లల్లో కనిపించిన వెయ్యి క్యాండిళ్ల మెరుపు కూడా అలా వచ్చిందే.
11 మంది పిచ్చోళ్లు గ్రౌండ్‌లో ఆడుతుంటే.. 11 వేల మంది పిచ్చోళ్లు గ్యాలరీల్లో కూర్చుని చూసే మాడ్‌గేమ్ అనే విపరీతమైన ఎకసెక్కాలు ఒకప్పటివి. వాటన్నిటినీ అధిగమించి క్రికెట్‌ను మాస్‌లోకి తీసుకెళ్లి.. ఊరమాస్ ఆటగా మల్చుకున్న క్రెడిట్ ఒక్క మన దేశానికే చెందుతుంది. ఒకప్పుడు జెంటిల్‌మెన్ గేమ్… అనే సాఫ్ట్ నేచరున్న క్రికెట్.. ఇప్పుడు మోస్ట్ మాస్ వ్యాల్యూ ఉన్న పాపులర్ గేమ్‌గా మారిందంటే.. క్రికెట్ అనేది ఒక బలమైన వ్యాపార వస్తువుగా ఎదిగిందంటే.. మన దేశభక్తిని కూడా క్రికెట్‌తోనే కొలుచుకుంటున్నామంటే.. ఆల్ క్రెడిట్ గోస్ టు కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు. ఆట మీద వాళ్లకుండే అమూల్యమైన ప్రేమలు.
వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో మనమే ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్. 1983లో కపిల్ దేవ్ విజృంభణతో విండీస్‌ను ఓడగొట్టి తొలి కప్పును తెచ్చుకుంది ఇండియా. అప్పటిదాకా మనల్ని అండర్‌డాగ్స్ కింద లెక్కేసిన ప్రపంచస్థాయి జట్లన్నీ ఇండియాను తేలిగ్గా తీసుకోవద్దని డిసైడయ్యాయి. తర్వాత ధోనీ కెప్టెన్సీలో 2011లో మళ్లీ వన్డే టోర్నీని గెలిచి.. వియ్యార్ బ్యాక్ అనిపించుకుంది. 2023లో ఆఖరిదాకా అదరగొట్టి.. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాది అప్పర్ హ్యాండ్ కావడంతో.. రన్నరప్‌గా నిలిచింది రోహిత్ సైన్యం.
2023లో జరిగిన ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీని తృటిలో కోల్పోయింది టీమిండియా. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియన్లు గెలవడంతో రన్నరప్‌గా నిలిచింది. 2021లో కూడా చివరి దాకా పోరాడి ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడాం. రెండుసార్లు రన్నర్స్‌గా నిలిచాం ఆంటే ఆల్మోస్ట్ విన్నర్స్ అన్నట్టేగా!
ఇక.. ట్వంటీ20 ఫార్మాట్‌లో పూర్తిగా బౌన్స్‌బ్యాక్ అయ్యాం. 2007లో సౌతాఫ్రికాలో జరిగిన ఇనాగురల్ టోర్నీలో పాకిస్తాన్‌ను మట్టికరిపించి ఫస్ట్ విక్టరీ కొట్టింది టీమిండియా. 17 ఏళ్ల గ్యాప్ తర్వాత.. హిస్టరీ రిపీటైంది. అమెరికాతో కలిపి 20 జట్లుగా విస్తరించిన ఐసీసీ ట్వంటీ20 టోర్నీని మళ్లీ చేతికందుకుని.. ప్రపంచవిజేతగా మీసం మెలేసింది రోహిత్ సేన.
2023 జూన్‌లో జరిగిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్పులో రన్నర్స్ మనమే.. 2023 నవంబర్‌లో జరిగిన ఐసీసీ వన్డే క్రికెట్ ఛాంపియన్ షిప్పును కొట్టిందీ మనమే.. 2024 మేలో ఐసీసీ టీ20 చాంపియన్‌షిప్పును గెల్చుకున్నదీ మనమే. కేవలం ఏడాది గ్యాప్‌లో మూడు బ్లాక్‌బస్టర్లు కొట్టి.. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్‌మీల్స్ పెట్టారు మన చిచ్చర పిడుగులు. సో.. ఫార్మాట్ ఏదైనా.. ఛాంపియన్లం మనమే అన్నమాట. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇదొక గోల్డెన్ ఏరా.
ఈ జైత్రయాత్రల ఫలితం ఏంటంటే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 122 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉంది టీమిండియా. టెస్టు ర్యాంకింగ్స్‌లో టీ20 ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో ఉన్నాం. అల్టిమేట్‌గా పెర్ఫామెన్స్ విషయంలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది టీమిండియా. ప్రపంచ ఛాంపియన్లమని విర్రవీగిన దేశాలన్నిటికీ చుక్కలు చూపిస్తూ.. ఆటలో తనదైన మార్కుని క్రియేట్ చేస్తూ ఆకాశమే హద్దుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది మెన్ ఇన్ బ్లూ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..