Kolkata Knight Riders vs Punjab Kings: IPL 2022 8వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) తో పోటీపడుతుంది. శుక్రవారం (ఏప్రిల్ 1) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా మొదటి మ్యాచ్‌లో బెంగళూరును మట్టికరిపించిన పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయంపై కన్నేసింది. మరోవైపు గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని విజయాల బాట పట్టేందుకు సిద్ధమైంది శ్రేయస్ సేన. ఇక విజయంతో టోర్నీని ప్రారంభించినప్పటికీ పంజాబ్ కింగ్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు గాను దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ జట్టులో చేరనున్నాడు. మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న అతడు శుక్రవారం మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లు పరిశీలిస్తే బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదనిపిస్తోంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌పై మంచు ప్రభావం చూపుతున్నందున టాస్ కీలక పాత్ర పోషించనుంది. దీంతో టాస్ నెగ్గిన జట్టు మొదట ఫీల్డింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
వారిపైనే భారం..
కాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్లు అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్‌లు తొందరగానే చాలా తేలికగా వికెట్ ఇచ్చేశారు. భారీ స్కోరు సాధించాలంటే వారు మళ్లీ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గత మ్యాచ్‌లో విఫలమైనా అతను సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. నితీష్ రాణా నిలకడగా పరుగులు సాధించాల్సిన అవసరముంది. వీరితో పాటు సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, బిగ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ లు మిడిల్ ఆర్డర్‌లో రాణించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ రెండు మ్యాచ్‌ల్లోనూ కొత్త బంతితో అద్భుతంగా రాణించాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కూడా మరింత మెరుగ్గా రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. కాగా స్పిన్ విభాగంలో సునీల్ రాణిస్తున్నా.. మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ అందుకోవాల్సి ఉంది.
బౌలర్లు సత్తా చాటాల్సిందే..
ఇక పంజాబ్ విషయానికొస్తే.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రాజపక్సే RCBతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. అదేవిధంగా ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ కూడా సత్తా చాటాలని కోచ్ అనిల్ కుంబ్లే ఆశిస్తున్నాడు. ఇక ఐపీఎల్ అరంగేట్రంలోనే విఫలమైన అండర్-19 వరల్డ్ కప్ స్టార్ రాజ్‌బావాకు మరో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. బౌలింగ్ విషయంలో పంజాబ్ కొంచెం బలహీనంగా ఉంది. సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఒడియన్ స్మిత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌ల స్పిన్ ద్వయం కూడా మెరుగ్గా రాణించాల్సి ఉంది.
కేకేఆర్ దే పైచేయి..
కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు మొత్తం 29 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో KKRదే పైచేయిగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 19 మ్యాచ్‌లు, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లు గెలిచాయి. గత సీజన్‌లో కోల్‌కతా ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడిస్తే మరో మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతాను ఖంగు తినిపించింది. 2020లో కూడా చెరో ఒక్కో విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించవచ్చు. అయితే బౌలింగ్, బ్యాటింగ్ లోనూ పటిష్ఠంగా ఉన్న కేకేఆర్‌పై విజయం సాధించాలంటే పంజాబ్ చెమటోడ్చక తప్పదు.
కోల్‌కతా నైట్ రైడర్స్ స్వ్కాడ్:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిజిత్ తోమర్, అజింక్యా రహానే, బాబా ఇందర్‌జిత్, నితీష్ రాణా, ప్రథమ్ సింగ్, రింకూ సింగ్, అశోక్ శర్మ, పాట్ కమిన్స్, రసిఖ్ దార్, శివమ్ మావి, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, అంకుల్ రాయ్, చమికా కరుణరత్నే, మహ్మద్ నబీ, రమేష్ కుమార్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్.
పంజాబ్ కింగ్స్ స్వ్కాడ్:
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, షారుఖ్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ఇషాన్ పోరెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ, రాజ్ అంగద్ బావా, రిషి ధావన్, ప్రేరక్ మన్కడ్, వైభవ్ అరోరా, హృతిక్ ఛటర్జీ, బల్తేజ్ ధండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ తైడే, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్.
Also Read: Andhra Pradesh: పశువులకూ సరోగసీ.. మన ఏపీలోనే.. మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని సేకరించి..
Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?
Viral Video: పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసి చింపాంజీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..