West indies vs India T20 Match: ఈ మ్యాచ్‌లో 32 సిక్సర్లు కొట్టారు.. రెండు సెంచరీలు నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద సృష్టించారు. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ జట్టును గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించారు కానీ అది సాధ్యపడిందా అనేది తెలుసుకుందాం. వాస్తవానికి ఈ టీ 20 మ్యాచ్ 2016 లో అమెరికాలోని ఫ్లోరిడాలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ రోజు అంటే సరిగ్గా ఆగస్టు 27న అని అర్థం.
మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్ 21 సిక్సర్లు కొట్టడం ద్వారా రచ్చ సృష్టించారు. ఎవిన్ లూయిస్ కేవలం 48 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతను తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. అతనితో పాటు జాన్సన్ చార్లెస్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేశాడు. ఇద్దరూ 9.3 ఓవర్లలో మొదటి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. వీరితో పాటు ఆండ్రీ రస్సెల్, కీరాన్ పొలార్డ్ తలా 22 పరుగులు చేశారు. టీమిండియా తరఫున జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
ప్రతిస్పందనగా రోహిత్ శర్మ, అజింక్యా రహానే ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కానీ రహానే 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మూడో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. రోహిత్ 28 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. రాహుల్‌తో పాటు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జత కలిసాడు. ఇద్దరూ జట్టును విజయానికి దగ్గరగా తీసుకువెళ్లారు.
ఈ సమయంలో రాహుల్ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి బంతికి భారత జట్టుకు రెండు పరుగులు అవసరం ధోనీ స్ట్రైక్‌లో ఉన్నాడు. కానీ డ్వేన్ బ్రావో తెలివిగా బౌలింగ్ వేయడంతో ధోని బోల్తా పడ్డాడు. బంతి గాల్లోకి లేవడంతో విండీస్ ప్లేయర్ క్యాచ్ పట్టడంతో కథ ముగిసింది. భారత జట్టు ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. అమెరికా గడ్డపై జరిగిన ఈ మొదటి మ్యాచ్‌లో మొత్తం 489 పరుగులు జాలువారాయి. 32 సిక్సర్లు నమోదవడం విశేషం.