26/11 ఉగ్ర దాడిని ఎప్పటికీ మరిచిపోలేమని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబాలు బాగుండాలని కోరుకున్నారు. “ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేము, కోల్పోయిన జీవితాలను ఎప్పటికీ మరచిపోలేము. వారి ప్రియమైన వారిని కోల్పోయిన స్నేహితులు, కుటుంబాలకు నా ప్రార్థనలు పంపుతున్నాను” అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. 2008 నవంబర్ 26న 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ముంబైలోని కొలాబా సముద్రతీరానికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు.
అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి ముష్కరులు చొరబడ్డారు. వారి వద్ద ఉన్న ఏకే-47 తుపాకులతో ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. కన్పించిన వారిని పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని దాడికి ప్రజలు భీతిల్లిపోయారు. భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడి నుంచి పారిపోయిన ముష్కరులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
లష్కరే తోయిబా ఉగ్రమూకకు చెందిన 10 మంది ముంబయిలో 12 చోట్ల నరమేధం సృష్టించారు. పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు.
We will never forget this day, we will never forget the lives lost. Sending my prayers to the friends and families who lost their loved ones ?
— Virat Kohli (@imVkohli) November 26, 2021
Read Also.. Tim Paine: క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టిమ్ పైన్..! ఎందుకంటే..