
Wasim Akram : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లలో ఒకడు. తన అద్భుతమైన బౌలింగ్ కారణంగా చాలామంది అతనిని పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రంతో పోలుస్తారు. సోషల్ మీడియా, క్రికెట్ ప్యానెల్స్‌లో బుమ్రా, వసీం అక్రంలలో ఎవరు గొప్ప బౌలర్ అనే చర్చ నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోలికపై స్వయంగా వసీం అక్రం స్పందించాడు.
బుమ్రాతో పోలికపై అక్రం వ్యాఖ్యలు..
జియో టీవీ షో హార్నా మనా హైలో వసీం అక్రం మాట్లాడుతూ.. “జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. తన స్పీడు కూడా అద్భుతం. అతని వర్క్‌లోడ్‌ను బీసీసీఐ మేనేజ్ చేసిన విధానం చాలా ప్రశంసనీయం. కానీ, 90వ దశకంలోని క్రికెట్‌ను ఇప్పుడున్న క్రికెట్‌తో పోల్చలేము. నేను లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌ను, అతను రైట్ హ్యాండ్ బౌలర్. ఇది కేవలం సోషల్ మీడియా చర్చ మాత్రమే, దాని గురించి మనం పట్టించుకోకూడదు. అతడి కాలంలో అతడు పేరు సంపాదించుకున్నాడు. నేను నా కాలంలో ఆడాను. అతడు ఇప్పటిక క్రికెట్‌కు ఒక గొప్ప బౌలర్.” అని వ్యాఖ్యానించాడు.
ఆటగాళ్ల మధ్య పోలిక.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?
వసీం అక్రం తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, బుమ్రా ఇప్పటివరకు 48 టెస్టుల్లో 219 వికెట్లు తీశాడు. అతని యావరేజ్ 19.82గా ఉంది. దీనికి తోడు అతను వన్డేలలో 149, టీ20లలో 82 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, బుమ్రా వేగంగా గొప్ప బౌలర్ల జాబితాలో స్థానం సంపాదిస్తున్నాడు.
బుమ్రాను మెచ్చుకున్న వరుణ్ ఆరోన్
భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ కూడా ఈ చర్చలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “బుమ్రాను ఒక జీనియస్ బౌలర్ అని చెప్పడం కూడా తక్కువ అవుతుంది. అతను సేనా(SENA)(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వసీం అక్రం కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఇది అతని కెపాసిటీని నిరూపిస్తుంది. వసీం అక్రం తన కాలంలో గొప్ప పేసర్. బుమ్రా కూడా అక్రం కంటే ముందు కాకపోయినా, కనీసం అతని స్థాయిలో ఉన్న బౌలర్” అని పేర్కొన్నాడు.
ఆసియా కప్‌లో బుమ్రా సత్తా
జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఆసియా కప్ 2025లో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. అతని ఫిట్‌నెస్, వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికి చాలా కాలం పాటు అతనికి టీ20 క్రికెట్ నుంచి విశ్రాంతిని ఇచ్చారు. ఇప్పుడు యూఏఈలో జరిగే టోర్నమెంట్‌లో అతను టీమిండియా పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..