
Virat Kohli : సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లకు టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ కింగ్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. గత కొన్ని రోజులుగా కోహ్లీ గురించి నెట్టింట ఒక వింత ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలపై కోహ్లీ నేరుగా స్పందించకుండా, కేవలం రెండు ఎమోజీలతోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ వార్తల్లో అస్సలు నిజం లేదని తేలిపోయింది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు కోహ్లీ చుట్టూ అల్లుకున్న ఆ ఆసక్తికర కథనం ఏంటో, దానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం.
అసలు కోహ్లీపై వచ్చిన ఆ పుకారు ఏంటి?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ జరుగుతున్న సమయంలో మ్యాచ్‌ల మధ్య మూడు రోజుల గ్యాప్ దొరికితే.. విరాట్ కోహ్లీ వెంటనే లండన్ వెళ్లి తన కుటుంబాన్ని కలిసి రావాలని అనుకుంటున్నారని, ఇందుకోసం చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఆయన ఆర్సీబీ యాజమాన్యాన్ని కోరినట్లు ఆ వార్తల సారాంశం. ఈ వార్త విన్న అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.
విరాట్ కోహ్లీ గట్టి కౌంటర్
తనపై జరుగుతున్న ఈ ప్రచారం విరాట్ దృష్టికి వెళ్లడంతో, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. తనపై వచ్చిన ఆ ఫేక్ న్యూస్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. దానికి రెండు నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. అంటే ఆ వార్త ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పకనే చెప్పారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం ఆ ఎమోజీలతోనే ఆ వార్తల్లో ఏమాత్రం దమ్లేదని కోహ్లీ స్పష్టం చేసేశారు.
ఐపీఎల్ 2026 కోసం కోహ్లీ కఠిన శ్రమ
ప్రస్తుతం విరాట్ కోహ్లీ పూర్తి ఫోకస్ ఐపీఎల్ 19వ సీజన్ పైనే ఉంది. గత వారమే ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో చేరారు. ప్రాక్టీస్ సెషన్లలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెట్స్‌లో గంటల తరబడి చెమటోడుస్తూ, యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచుతూ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తన ఫ్యామిలీ లండన్‌లో ఉన్నప్పటికీ, ఐపీఎల్ సమయంలో ఆయన తన పూర్తి సమయాన్ని జట్టుకే కేటాయిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
ఆర్సీబీతో విడదీయలేని బంధం
ఐపీఎల్ చరిత్రలో మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. 2008 నుంచి ఆయన ఆర్సీబీతోనే ప్రయాణం చేస్తున్నారు. మార్చి 28న జరగబోయే ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. పుకార్లన్నీ పక్కన పెట్టి, ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలన్న కసితో కింగ్ కోహ్లీ కనిపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..