IND vs SL: ఎంఎస్‌ ధోనిని గుర్తుచేసిన విరాట్ కోహ్లీ.. హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌.. వైరల్‌ వీడియో

|

Jan 15, 2023 | 9:13 PM

ఈ మ్యాచ్‌లో ఒక షాట్‌తో మిస్టర్ కూల్‌ ఎంఎస్‌ ధోనిని గుర్తు చేశాడు కోహ్లీ. ఇన్నింగ్స్‌ 44వ ఓవర్ నాలుగో బంతికి లాంగ్ ఆన్ మీద అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ ఎంఎస్ ధోనీని గుర్తు చేసింది. రజిత వేసిన బంతిని ధోని స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడాడు కోహ్లీ. దీంతో బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోయింది.

IND vs SL: ఎంఎస్‌ ధోనిని గుర్తుచేసిన విరాట్ కోహ్లీ.. హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌.. వైరల్‌ వీడియో
Follow us on

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లను భీకరంగా చిత్తు చేశాడు. 110 బంతుల్లో 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతని అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 74వ సెంచరీ కాగా వన్డేల్లో 46వది. ఇక ఈ సిరీస్‌లో రెండో సెంచరీ కాగా గత 4 వన్డేల్లో మూడో సెంచరీ కావడం మరో విశేషం. అంతకుముందు బంగ్లాతో జరిగిన చివరి వన్డేలోనూ విరాట్ సెంచరీ బాదాడు. కాగా ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఒక షాట్‌తో మిస్టర్ కూల్‌ ఎంఎస్‌ ధోనిని గుర్తు చేశాడు కోహ్లీ. ఇన్నింగ్స్‌ 44వ ఓవర్ నాలుగో బంతికి లాంగ్ ఆన్ మీద అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ ఎంఎస్ ధోనీని గుర్తు చేసింది. రజిత వేసిన బంతిని ధోని స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడాడు కోహ్లీ. దీంతో బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గౌతమ్ గంభీర్ కూడా అతని షాట్‌ను మెచ్చుకున్నాడు. కోహ్లి సెంచరీ కంటే అతని సిక్స్ అద్భుతమని పొగిడాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత విరాట్‌ మరింత దూకుడు పెంచాడు. 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత అతను ఏకంగా 7 సిక్సర్లు కొట్టడం విశేషం.

కాగా కోహ్లి శ్రీలంకపై వన్డేల్లో 10వ సెంచరీని కూడా సాధించాడు. ఏ జట్టుపైనైనా వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఇదే. అంతేకాదు స్వదేశంలో వన్డేల్లో అత్యధికంగా 21 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ భారత్‌లో సాధించిన 20 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ తుడిచేశాడు. కాగా కోహ్లి అజేయ ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 73 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీతో పాటు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా వన్డేల్లో రెండో సెంచరీ సాధించాడు. అతను 116 పరుగుల చేశాడు. రెండు సెంచరీలతో సిరీస్‌ ఆద్యంతం రాణించిన విరాట్ కోహ్లీకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..