
సీనియర్ రెజ్లర్ వినేష్ ఫోగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించి, మళ్ళీ పోటీల్లోకి రావాలని నిర్ణయించుకున్న వినేష్‌కు షాక్ ఇస్తూ జూన్ 26, 2026 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. సుమారు 18 నెలల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో ఆమె పునరాగమనం చేయాల్సి ఉంది. కానీ ఈ తాజా నిషేధంతో ఆమె ఆ టోర్నీకి దూరమైంది.
వినేష్ ఫోగాట్‌కు పంపిన 15 పేజీల నోటీసులో రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, తద్వారా భారత రెజ్లింగ్ రంగానికి నష్టం చేకూరిందని సమాఖ్య పేర్కొంది. ముఖ్యంగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు తగ్గడంలో వైఫల్యం చెంది అనర్హతకు గురవ్వడం, డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం తన చిరునామా సమాచారాన్ని (వేర్ అబౌట్స్) అందించడంలో విఫలమవ్వడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వీటిపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సమాఖ్య ఆమెను ఆదేశించింది.
కేవలం రెజ్లింగ్ మాత్రమే కాకుండా, క్రికెట్ రంగంలో కూడా డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘన ప్రకంపనలు సృష్టిస్తోంది. టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మహిళా క్రికెటర్ షఫాలీ వర్మలకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో పరీక్షల కోసం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిని ‘వేర్ అబౌట్స్’ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని వారిని కోరారు.
క్రీడాకారులు ఎక్కడ ఉన్నారో అధికారులకు ముందే సమాచారం ఇవ్వడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తప్పనిసరి. ఇలా వరుసగా మూడు సార్లు విఫలమైతే వారిపై నిషేధం విధించే అవకాశం ఉంటుంది. వినేష్ ఫోగాట్ గతంలో నిరసనల్లో కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు సాంకేతిక కారణాలతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. క్రికెటర్ల విషయంలో కూడా ఇదే జరిగితే జట్టు కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత క్రీడారంగంలో నిబంధనల అమలు ఎంత కఠినంగా ఉందో తెలియజేస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..