
Vinesh Phogat : భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో క్రీడల నుంచి తప్పుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్ ఇప్పుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వినేశ్ ఫోగట్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆమె దృష్టి ఇప్పుడు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌పై ఉంది.
వినేశ్ ఫోగట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. పారిస్ నా చివరి ప్రయాణమా అని ప్రజలు నన్ను తరచుగా అడుగుతుండేవారు. చాలా కాలంగా ఈ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. మ్యాట్‌కి, ఒత్తిడికి, అంచనాలకు, చివరికి నా కలలకు కూడా దూరంగా ఉండాలని నేను భావించాను. సంవత్సరాలలో మొదటిసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను. నా బాధ్యతలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాను. నాకు ఇప్పటికీ ఆట అంటే ఇష్టం. ఇప్పటికీ పోటీ పడాలని కోరుకుంటున్నానంటూ రాసుకొచ్చారు.
వినేశ్ ఫోగట్ పోస్టును ఇంకా కొనసాగిస్తూ.. “ఆ నిశ్శబ్దంలో నేను మర్చిపోయిన ఒక విషయాన్ని కనుగొన్నాను. ఆ నిప్పు ఎప్పుడూ ఆరిపోలేదు. అది కేవలం అలసట కింద అణచివేయబడింది. క్రమశిక్షణ, పోరాటం… ఇవన్నీ నా రక్తంలోనే ఉన్నాయి. నేను ఎంత దూరం వెళ్ళిపోయినా నాలో ఒక భాగం మ్యాట్‌పైనే ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, నిర్భయమైన హృదయంతో, ఎప్పుడూ లొంగని స్ఫూర్తితో LA28 వైపు తిరిగి అడుగులు వేస్తున్నాను. ఈసారి నేను ఒంటరిగా నడవడం లేదు, నా కొడుకు నా జట్టులో చేరుతున్నాడు. 2028 ఒలింపిక్స్ వైపు ఈ మార్గంలో నా చిన్న చీర్ లీడర్ అని పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ వినేశ్ ఫోగట్‌కు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి మహిళల 50 కేజీల కేటగిరీ ఫైనల్‌కు చేరుకున్న వినేశ్, ఫైనల్‌కు కొద్ది గంటల ముందు ఓవర్‌వెయిట్ ఆరోపణతో డిస్‌క్వాలిఫై అయ్యారు. దీని కారణంగా ఆమె మెడల్ సాధించలేకపోయారు. అంతకుముందు ఆమె రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు.. కానీ మెడల్ గెలవలేకపోయారు. ఇప్పుడు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తన మొదటి ఒలింపిక్ మెడల్‌ను గెలవడానికి వినేశ్ మరోసారి ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారు.