
Devon Conway : ఐపీఎల్ 2026 వేలంలో తనను ఎవరూ కొనలేదన్న కోపాన్ని న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మైదానంలో చూపించాడు. డిసెంబర్ 16న అబుదాబిలో జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ కాన్వేను కొనుగోలు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్నాడో ఏమో గానీ, వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 327 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్ ఆడేది వైట్ బాల్‌తో కావచ్చు, కానీ తను ఏ ఫార్మాట్‌లోనైనా చెలరేగగలనని కాన్వే ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు.
ఈ మ్యాచ్‌లో కాన్వే బ్యాటింగ్ చూస్తుంటే టెస్ట్ ఆడుతున్నాడా లేక టీ20 ఆడుతున్నాడా అనే అనుమానం కలిగింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 42 ఫోర్లు, సిక్సర్లతో విండీస్ బౌలర్లను చితక్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 367 బంతులు ఎదుర్కొన్న కాన్వే, 31 ఫోర్లతో 227 పరుగులు చేసి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ 139 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. అంటే ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించి అరుదైన ఫీట్ నమోదు చేశాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో డెవాన్ కాన్వే చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచాడు. కాన్వే కెరీర్‌లో ఇది 6వ, 7వ సెంచరీలు కావడం విశేషం. అంతేకాకుండా, తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 227 పరుగులు అతడి టెస్ట్ కెరీర్‌లోనే అత్యధిక స్కోరు. గతంలో తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చేసిన 200 పరుగుల రికార్డును ఇన్నాళ్లకు కాన్వే అధిగమించాడు.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో కాన్వే పేరు ఉండటం ఒక ఎత్తు అయితే, వేలం ముగిసిన వెంటనే ఇలాంటి విశ్వరూపం చూపించడం మరో ఎత్తు. తనను తీసుకోని జట్లకు తన విలువేంటో ఈ పరుగుల వరదతో అర్థమయ్యేలా చెప్పాడు. కాన్వే ఫామ్ చూస్తుంటే, సీజన్ మధ్యలో ఏదైనా జట్టుకు ఆటగాడు అవసరమైతే కచ్చితంగా అందరి కళ్లు ఇతడిపైనే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కాన్వే సృష్టించిన ఈ టెస్ట్ తుఫాను సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..