
U19 Asia Cup Final: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025 తుది సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపు ఓటముల కంటే కూడా, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ అనుసరించబోయే వైఖరిపైనే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టి నిలిచింది. ముఖ్యంగా 84 రోజుల క్రితం సీనియర్ టీమిండియా సృష్టించిన సంచలనం, ఇప్పుడు జూనియర్ జట్టు విషయంలోనూ పునరావృతమవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
విషయం ఏంటంటే, సరిగ్గా 84 రోజుల క్రితం (సెప్టెంబర్ 28, 2025) సీనియర్ ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. కానీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించారు. అప్పట్లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా, పాకిస్థాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ అయిన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవద్దని టీమిండియా నిర్ణయించుకుంది. ఆ ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండిపోయింది.
ఇప్పుడు అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జూనియర్ ఆటగాళ్లు తమ సీనియర్లను అనుసరిస్తూ పాక్ ఆటగాళ్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఫైనల్‌లో భారత్ గెలిస్తే, ట్రోఫీని మళ్ళీ మోహ్సిన్ నఖ్వీ అందించే అవకాశం ఉంది. మరి సీనియర్ల బాటలోనే జూనియర్లు కూడా ట్రోఫీని తిరస్కరిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాలను క్రీడలకు దూరంగా ఉంచాలని ఐసీసీ ఇరు జట్లకు సూచించినప్పటికీ, దేశ గౌరవం, సీనియర్ల నిర్ణయానికి కట్టుబడి జూనియర్ టీమిండియా కూడా కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ ట్రోఫీని తీసుకోకపోతే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చరిత్రలో ఇది మరో సంచలనంగా మారనుంది. మైదానంలో ఆటతో పాటు, గ్రౌండ్ బయట జరగబోయే ఈ ట్రోఫీ పాలిటిక్స్ పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..