U19 Asia Cup Final: నేడు దుబాయ్ గ్రౌండ్ లో రక్తం మరిగించే యుద్ధం.. పాక్ ను ఖతం చేసేందుకు వైభవ్ రెడీ

U19 Asia Cup Final: ఆదివారం వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. అది కూడా భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయంటే ఆ మజానే వేరు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో నేడు (డిసెంబర్ 21) అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు జరగనుంది.

U19 Asia Cup Final:  నేడు దుబాయ్ గ్రౌండ్ లో రక్తం మరిగించే యుద్ధం.. పాక్ ను ఖతం చేసేందుకు వైభవ్ రెడీ
U19 Asia Cup Final

Updated on: Dec 21, 2025 | 7:52 AM

U19 Asia Cup Final: ఆదివారం వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. అది కూడా భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయంటే ఆ మజానే వేరు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో నేడు (డిసెంబర్ 21) అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు జరగనుంది. ఆసియా ఖండంలో క్రికెట్ రారాజు ఎవరో తేల్చుకునే ఈ మహా సంగ్రామంలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సెమీఫైనల్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత్, అదే జోరుతో పాకిస్థాన్‌ను చిత్తు చేసి 9వ సారి కప్పు గెలవాలని పట్టుదలతో ఉంది.

ఈ టోర్నీలో భారత జట్టు ప్రస్థానం అజేయంగా సాగుతోంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత్ ఇప్పటికే 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అంటే ఈ టోర్నీలో పాక్ ఇప్పటికే భారత్ చేతిలో దెబ్బతింది. పాకిస్థాన్ కూడా సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్ చేరినప్పటికీ, టీమిండియాతో పోలిస్తే వారి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ స్టేజ్‌లో మన కుర్రాళ్లు వారిని ముప్పుతిప్పలు పెట్టారు.

ముఖ్యంగా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ మీద అందరి కళ్లు ఉన్నాయి. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై కేవలం 5 పరుగులకే అవుట్ అయిన వైభవ్, ఈ ఫైనల్‌లో ఆ కసితీర్చుకోవాలని చూస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 235 పరుగులు చేసిన వైభవ్, భారత్ తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పాక్ బౌలర్లను ఒక ఆటాడుకోవడానికి ఈ చిచ్చరపిడుగు సిద్ధమైపోయాడు. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తున్నా, విహాన్ మల్హోత్రా, ఆరోన్ జార్జ్ వంటి వారు బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు.

బౌలింగ్ విభాగంలో కనిష్క్ చౌహాన్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కూడా కనిష్క్ వికెట్లు తీస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే. ఓ వైపు భారత్ తన 9వ టైటిల్ కోసం చూస్తుంటే, పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి ఆసియా కప్‌ను ముద్దాడేది మన కుర్రాళ్లేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..