
Asia Cup 2025 : ఆసియా కప్ 2025కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలోని అబుదాబి, దుబాయ్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీ20 ఆసియా కప్‌లో అత్యధిక సార్లు డకౌట్ (సున్నా పరుగులకే ఔట్) అయిన బ్యాట్స్‌మెన్ రికార్డును ఎవరు సాధించారో తెలుసుకుందాం. ఈ అవాంఛిత రికార్డుల జాబితాలో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు.
మష్రఫ్ మొర్తాజాకు షాకింగ్ రికార్డ్
ఈ అన్ వాంటెడ్ రికార్డు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫ్ మొర్తాజా పేరు మీద ఉంది. టీ20 ఆసియా కప్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా మొర్తాజా నిలిచాడు. ఒకే సీజన్‌లో మూడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగిన ఘనత కూడా అతనికే దక్కింది. 2016 ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన మొర్తాజా, ఐదు వికెట్లు తీసి బౌలింగ్‌లో పర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు సార్లు డకౌట్ కావడం విశేషం.
హార్దిక్ పాండ్యా కూడా..
మొర్తాజా అన్ వాంటెడ్ రికార్డుకు దగ్గరగా మరో ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హార్దిక్ పాండ్యా కూడా ఉండటం గమనార్హం. శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక, పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్ అలీ, యూఏఈ ఆటగాడు కిన్చిత్ షా, శ్రీలంక ఆటగాళ్లు కుశాల్ మెండిస్, దసున్ శనకలతో పాటు హార్దిక్ పాండ్యా కూడా టీ20 ఏషియా కప్‌లో రెండు సార్లు సున్నా పరుగులకు ఔట్ అయ్యారు.
ఆసియా కప్ 2025లో 8 జట్లు
ఈసారి ఆసియా కప్ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు తన ప్రయాణాన్ని సెప్టెంబర్ 10న యూఏఈతో మొదలుపెడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-ఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ జట్లు ఉండగా, గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్-చైనా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..