
Virat kohli : ప్రముఖ హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది.. ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. సరిగ్గా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్ళీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ మళ్ళీ నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. బుధవారం మధ్యాహ్నం ఐసీసీ అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనుంది. గత రెండు నెలలుగా విరాట్ కోహ్లీ మునుపటి విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో విరుచుకుపడటమే కాకుండా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపు ప్రదర్శనలే అతడిని మళ్ళీ అగ్రస్థానంలో కూర్చోబెట్టాయి. 2021 ఏప్రిల్ 13న పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం చేతిలో కోల్పోయిన తన నంబర్-1 ర్యాంకును, సరిగ్గా 1736 రోజుల తర్వాత కోహ్లీ తిరిగి దక్కించుకోవడం విశేషం.
తొలిసారి నంబర్-1 ఎప్పుడు?
2008లో అండర్-19 వరల్డ్ కప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ, చాలా వేగంగా టీమిండియాలోలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2010 నాటికే టాప్-5 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చిన విరాట్, 2013 నవంబర్‌లో తొలిసారి ప్రపంచ నంబర్-1 వన్డే బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే అప్పట్లో సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ నుంచి గట్టి పోటీ ఉండటంతో ఆ స్థానం మారుతూ ఉండేది.
ఆ నాలుగేళ్లూ కోహ్లీ సామ్రాజ్యమే
2017 నుంచి 2021 వరకు వన్డే క్రికెట్‌లో కోహ్లీ ప్రభంజనం మామూలుగా లేదు. డివిలియర్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీ, వరుసగా 1500 రోజులకు పైగా ఆ స్థానంలోనే కొనసాగాడు. 2018లో కోహ్లీ 909 రేటింగ్ పాయింట్లను సాధించి చరిత్ర సృష్టించాడు. 21వ శతాబ్దంలో వన్డే క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇన్ని పాయింట్లు సాధించలేదు. ఇప్పుడు వన్డేల్లో 53 సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్, తన కిరీటాన్ని మళ్ళీ ధరించబోతున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..