IPL 2026 : ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్.. సైబర్ పోలీసుల సీరియస్ వార్నింగ్

IPL 2026 : సైబర్ మోసగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసి అమాయక ఫ్యాన్స్‌ను బుట్టలో పడేస్తున్నారు. స్టేడియంలో మ్యాచ్ అంతా అమ్ముడైపోయింది అని తెలిసిన తర్వాత కూడా.. తమ వద్ద VIP/VVIP పాస్‌లు ఉన్నాయని, చివరి నిమిషంలో అర్జెంట్‌గా తక్కువ ధరకే ఇచ్చేస్తామని నమ్మిస్తున్నారు.

IPL 2026 : ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..  సైబర్ పోలీసుల సీరియస్ వార్నింగ్
Ipl 2026 Playoffs Ticket Sales

Updated on: May 20, 2026 | 9:14 PM

IPL 2026 : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ 2026 క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. అయితే ఇదే అడ్డుగా పెట్టుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రికెట్ అభిమానుల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ ఐపీఎల్ టికెట్ల దందాకు తెరలేపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కమీషనర్, డైరెక్టర్ శిఖా గోయల్ ఒక హెచ్చరికను జారీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వీఐపీ పాస్‌లు, డిస్కౌంట్ ఆఫర్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రయాణికులను, క్రీడా ప్రేమికులను హెచ్చరించారు.

బ్లాక్ టికెట్ల మాయాజాలం..

సైబర్ మోసగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసి అమాయక ఫ్యాన్స్‌ను బుట్టలో పడేస్తున్నారు. స్టేడియంలో మ్యాచ్ అంతా అమ్ముడైపోయింది అని తెలిసిన తర్వాత కూడా.. తమ వద్ద VIP/VVIP పాస్‌లు ఉన్నాయని, చివరి నిమిషంలో అర్జెంట్‌గా తక్కువ ధరకే ఇచ్చేస్తామని నమ్మిస్తున్నారు. టికెట్లు కావాలనుకునే వారి నుంచి యూపీఐ ఐడీలు, క్యూఆర్ కోడ్‌లు లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా అడ్వాన్స్ రూపంలో మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు అకౌంట్‌లో పడగానే నకిలీ, ఎడిట్ చేసిన పీడీఎఫ్ టికెట్లను వాట్సాప్‌లో పంపిస్తున్నారు. తీరా మ్యాచ్ రోజు స్టేడియం గేట్ వద్దకు వెళ్ళినప్పుడు అవి నకిలీవని తేలడంతో ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారు. మరికొందరు కేటుగాళ్లు డబ్బులు తీసుకోగానే ఫోన్ స్విచ్ఛాప్ చేసి గ్రూపుల నుండి మాయమవుతున్నారు.

ఇవి కనిపిస్తే మోసమే అని నమ్మండి

ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు సంబంధించి కేవలం డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే అధికారిక బుకింగ్ భాగస్వామి అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పష్టం చేసింది. సైబర్ పోలీసులు ప్రజలు సులభంగా గుర్తుపట్టేలా కొన్ని ముఖ్యమైన అలర్ట్ సంకేతాలను విడుదల చేశారు.

భారీ డిస్కౌంట్లు: డిమాండ్ ఉన్న మ్యాచ్‌లకు ఎవరైనా భారీ తగ్గింపు ఇస్తున్నారంటే అనుమానించాల్సిందే.

ఒత్తిడి చేయడం: ఇంకా 2 టికెట్లు మాత్రమే ఉన్నాయి, వెంటనే పేమెంట్ చేయండి అంటూ కస్టమర్లపై ఒత్తిడి తెస్తుంటారు.

వ్యక్తిగత యూపీఐ ఐడీలు: అఫీషియల్ పేమెంట్ గేట్‌వేలు కాకుండా ఎవరిదో పర్సనల్ ఫోన్ పే, గూగుల్ పే నంబర్లకు డబ్బులు పంపమనడం.

తక్కువ ఫాలోవర్ల పేజీలు: సోషల్ మీడియాలో ఎలాంటి గుర్తింపు లేని, కొత్తగా క్రియేట్ చేసిన పేజీల ద్వారా టికెట్లు అమ్మడం.

సేఫ్టీ టిప్స్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ సూచించారు. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ కరెక్ట్‌గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, అనధికారిక ఏజెంట్ల ద్వారా సోషల్ మీడియాలో డైరెక్ట్ మెసేజ్ చేసి టికెట్లు అస్సలు కొనకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నంబర్లను, బ్యాంకింగ్ రహస్య వివరాలను లేదా మీ పేమెంట్ స్క్రీన్‌షాట్లను ఎవరితోనూ పంచుకోవద్దు.

డబ్బులు పోతే ఏం చేయాలి?

ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి ఐపీఎల్ టికెట్ స్కామ్‌లో చిక్కుకుని డబ్బులు నష్టపోయి ఉంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1933 లేదా 1930 కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి. మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఫ్రీజ్ అయి, తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ cybercrime.gov.in లో కూడా ఆన్‌లైన్ ద్వారా మీ ఫిర్యాదును ఆధారాలతో సహా సబ్మిట్ చేయవచ్చు. సైబర్ భద్రతతోనే డిజిటల్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

 

 

Follow Us