
Jemimah Rodrigues Captain: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా భారత స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
గత మూడు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ విజయవంతంగా నడిపించింది. ఆమె సారథ్యంలో జట్టు మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ, ఒక్కసారి కూడా టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. అయితే, 2026 వేలానికి ముందు మెగ్ లానింగ్‌ను ఢిల్లీ జట్టు వదులుకోవడంతో, ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న జెమిమానే తర్వాతి వారసురాలిగా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ ఇటీవల మాట్లాడుతూ, రాబోయే సీజన్‌లో తమ జట్టుకు ఒక భారతీయ క్రీడాకారిణి కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్డ్ట్ జట్టులో ఉన్నప్పటికీ, స్థానిక ప్రాతినిధ్యం, భారత ప్లేయర్ల మీద నమ్మకంతో జెమిమా వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
సోషల్ మీడియాలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఒక రహస్య వీడియో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. డిసెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ ద్వారా కొత్త కెప్టెన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించనున్నారు.
మొత్తం మ్యాచ్‌లు: 27 (అన్నీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపునే)
మొత్తం పరుగులు: 507
సగటు: 28.16
హాఫ్ సెంచరీలు: 3
2024 సీజన్‌లో జెమిమా 153.59 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు చేసి తన సత్తా చాటింది. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటూ, జట్టును ఉత్సాహపరిచే జెమిమా సారథ్యంలోనైనా ఢిల్లీ జట్టు తన తొలి WPL టైటిల్‌ను గెలుస్తుందేమో చూడాలి.
WPL 2026 ఎప్పుడు మొదలవుతుంది? వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఫిబ్రవరి 5న వడోదరలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..