
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి సారించింది. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే సెలెక్టర్లు ఎంపిక చేసిన ఈ జట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకీబ్ నబీకి అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వినిపించాయి. రంజీ ట్రోఫీ 2025-26లో అద్భుత ప్రదర్శన కనబర్చిన నబీకి ప్లేస్ దక్కకపోవడం విమర్శలకు దారితీసింది. అయితే నబీకి చోటు ఎందుకు దక్కలేదనే విషయం పక్కనపెడితే.. జట్టులో చోటు దక్కించుకున్న ఓ ప్లేయర్ విషయంలో మాత్రం షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అండతోనే అతనికి జట్టులో చోటు దక్కిందే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే గుర్నూర్ బ్రార్.. ఐపీఎల్ 2024, 2025, 2026 సీజన్స్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాకుంటే ఏం.. ఏకంగా టీమిండియాలోనే ఆడిస్తానంటూ కెప్టెన్ గిల్ రికమండేషన్‌తోనే అతనికి ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేసినట్లు తీవ్ర విమర్శలు గుప్పుమన్నాయి. మరి నిజంగానే బ్రార్ ఎంపిక వెనుక గిల్ హస్తం ఉందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
2023లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున లక్నోతో జరిగిన ఓ మ్యాచ్లో బరిలోకి దిగిన బ్రార్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. పోనీ దేశవాళీ క్రికెట్లో అయినా అద్భుతమైన రికార్డులు ఉన్నాయా అంటే అదీ లేదు. నబీ ఒక్క రంజీ సీజన్‌లోనే 60 వికెట్లు తీశారు. కానీ బ్రార్ తన మొత్తం ఫస్ట్ క్లాస్ కెరీర్లో కూడా అన్ని వికెట్లు లేవు. మరి ఏ ప్రాతిపదికపై అతన్ని ఎంపిక చేశారు. కేవలం గిల్ కోరుకుంటే, అతని రికమండ్ చేస్తే ఒక మంచి బౌలర్‌కు అన్యాయం చేసి, ఓ సాధారణ బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటారా? అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. పైగా గిల్, బ్రార్ ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు, కెరీర్ తొలి నాళ్ల నుంచి కలిసి ఆడారు. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. గిల్‌తో స్నేహం కారణంగానే బ్రార్‌కు టీమిండియాలో చోటు దక్కిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన చాలా మంది ప్లేయర్లు టెస్టు జట్టులో ఉన్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి