
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు అత్యంత ఆసక్తికరమైన వార్త వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం మన టీమిండియాను సెలక్ట్ చేసే ముహూర్తం ఖరారైంది. రేపు, అంటే డిసెంబర్ 20, 2025 శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు బీసీసీఐ అధికారికంగా టీమిండియా ఆటగాళ్ల పేర్లను ప్రకటించబోతోంది. అదే రోజున వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న వైట్ బాల్ సిరీస్ (వన్‌డే, టీ20) కోసం కూడా జట్టును సెలక్ట్ చేయనున్నారు. జట్టును ప్రకటించిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడతారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గతేడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌ను ముద్దాడిన భారత్, ఈసారి సొంత గడ్డపై కప్‌ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు టీ20లకు వీడ్కోలు పలకడంతో, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యంగ్ టీమ్ ఈ భారీ బాధ్యతను మోయనుంది. ఈ టీమ్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుంది? రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్ స్టర్లను ఏ మేరకు ప్రభావం చూపుతారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వరల్డ్ కప్‌కు ముందే జనవరిలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 8 మ్యాచ్‌లు (3 వన్‌డేలు, 5 టీ20లు) జరుగుతాయి. ఇది వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు ఒక అద్భుతమైన ప్రాక్టీస్ సిరీస్ లాంటిది. వన్‌డే సిరీస్ జనవరి 11న వడోదరలో ప్రారంభమై, జనవరి 14న రాజకోట్ మరియు 18న ఇండోర్‌లో జరుగుతుంది. ఆ తర్వాత జరిగే 5 టీ20ల సిరీస్ జనవరి 21న నాగ్‌పూర్‌లో మొదలై.. రాయ్‌పూర్, గువాహటి, వైజాగ్ మీదుగా జనవరి 31న తిరువనంతపురంలో ముగుస్తుంది.
సొంత గడ్డపై వరల్డ్ కప్ జరగనుండటంతో భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో 2011 వన్‌డే వరల్డ్ కప్‌ను మనం సొంత గడ్డపైనే గెలుచుకున్నాం. అదే సెంటిమెంట్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో కూడా రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రేపు ప్రకటించే టీమ్‌లో ఎవరికి చోటు దక్కుతుంది? హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్ల పాత్ర ఏంటి? అనే ఉత్కంఠకు రేపు మధ్యాహ్నం తెరపడనుంది. క్రికెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి భారత్ వేదిక కాబోతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..