Team India: ‘ఎన్ని ఫైనల్స్ ఆడినా వేస్టే.. అతడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు’

Team India: శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి రావడంపై టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జట్టులో తీవ్రమైన పోటీ ఉన్నందున, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. శ్రేయాస్ దేశీయ క్రికెట్‌లో రాణించినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌కు అతనికి ఇంకా కొంత సమయం పట్టవచ్చునని చోప్రా అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడం ఈ అంచనాను బలపరుస్తుంది.

Team India: ఎన్ని ఫైనల్స్ ఆడినా వేస్టే.. అతడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు
Shreyas Iyer

Updated on: Jun 28, 2025 | 5:24 PM

India vs England: భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్‌లో రీఎంట్రీపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయాస్‌కు టెస్టు జట్టులో చోటు దక్కడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన చోప్రా, శ్రేయాస్ కంటే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వవచ్చని సూచించారు.

భారీ పోటీతో నిరీక్షణ తప్పదు..

ఆకాష్ చోప్రా ప్రకారం, ప్రస్తుతం భారత టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. చాలా మంది ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. “ప్రస్తుతం బ్యాటింగ్ యూనిట్‌లో సమస్య లేదు. శ్రేయాస్‌కు ఇప్పుడప్పుడే చోటు దక్కదు. దానర్థం ఎప్పటికీ రాదని కాదు, కానీ ఇప్పుడైతే రాదు. ఎందుకంటే మిగతా వారికి కూడా ఇంకా పూర్తి అవకాశాలు రాలేదు” అని చోప్రా వివరించారు.

సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారని, ధ్రువ్ జురెల్ జట్టులో ఉన్నా కూడా పక్కన కూర్చున్నాడని ఆయన గుర్తు చేశారు. “సర్ఫరాజ్ ఖాన్ ఇంకా పూర్తి స్థాయిలో తనను తాను నిరూపించుకోలేకపోయాడు. ధ్రువ్ జురెల్ జట్టులో ఉన్నాడు. కానీ, చాలా కాలంగా అవకాశం రాలేదు” అని చోప్రా అన్నారు.

దేశీయ క్రికెట్‌లో రాణించినా నిరీక్షణ తప్పడం లేదు..

శ్రేయాస్ అయ్యర్ ఇటీవల దేశీయ క్రికెట్‌లో, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీలో కూడా గణనీయమైన పరుగులు సాధించాడు. అయితే, టెస్ట్ క్రికెట్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుందని చోప్రా అభిప్రాయపడ్డారు.

“అతను చాలా మంచి ఫస్ట్‌క్లాస్ సీజన్ ఆడాడు, మంచి ఐపీఎల్ ఆడాడు, జట్టును గెలిపించాడు. ఇదంతా వైట్-బాల్ క్రికెట్‌కు మంచిది. కానీ టెస్ట్ క్రికెట్, ముఖ్యంగా స్వదేశంలో కాకుండా బయట ఆడే టెస్టుల్లో, అతడికి సమయం వస్తుంది, కానీ ఇప్పుడైతే రాదు. అతను ఇంకాస్త వేచి చూడాల్సిందే” అని చోప్రా స్పష్టం చేశారు.

ఇంగ్లాండ్ సిరీస్..

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై ఇప్పటికే కొంతమంది మాజీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ భవిష్యత్తుపై మరింత స్పష్టతను ఇస్తున్నాయి. ప్రస్తుతం జట్టు కూర్పు, ఇతర ఆటగాళ్ల ప్రదర్శన దృష్ట్యా, శ్రేయాస్ టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..