
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డిసెంబర్ 20న టీమ్ ఇండియాను ప్రకటించింది. సెలెక్టర్ అజిత్ అగార్కర్, సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ టోర్నమెంట్‌లో అర్ష్‌దీప్ సింగ్ కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ప్రపంచకప్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానాన్ని మరో బౌలర్ భర్తీ చేసే అవకాశం ఉంది. అసలు అర్ష్‌దీప్ సింగ్‌కు కోచ్ గౌతమ్ గంభీర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం సెలక్షన్ కమిటీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో ఆయన తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టోర్నమెంట్‌లో అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసి, జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక అదనపు స్పిన్నర్‌ను చేర్చుకోవచ్చనేది ఆయన ఆలోచన. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరిగిన ఆసియా కప్ 2025లో భారత్ ఏ వ్యూహంతో అయితే విజేతగా నిలిచిందో, అదే ఫార్ములాను గంభీర్ ఇక్కడ కూడా అనుసరించాలని చూస్తున్నారు.
ఆసియా కప్ 2025లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒకేసారి ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది, ఇది భారత్‌కు బాగా కలిసి వచ్చింది. ఇతర జట్లు ఫాస్ట్ బౌలింగ్ , స్పిన్ బౌలింగ్ మధ్య సమతుల్యత కోసం ప్రయత్నిస్తుంటే, భారత జట్టు మాత్రం ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లపైనే ఎక్కువ నమ్మకం ఉంచింది. దీనివల్ల జట్టుకు ఆశించిన ఫలితం దక్కింది.
ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026లో కూడా భారత్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల అర్ష్‌దీప్ సింగ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. బుమ్రా ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2025లో భారత జట్టు మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలను ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లుగా ఉపయోగించుకుంది. అక్కడ హార్దిక్ పాండ్యా, బుమ్రా కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించగా, శివమ్ దూబే మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేశారు. ఇదే బౌలింగ్ విభాగం 2026 ప్రపంచకప్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.
స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు ఉంటారు. కాగా, అర్ష్‌దీప్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (110 వికెట్లు) తీసిన బౌలర్‌గా ఉన్నప్పటికీ, బుమ్రా, హార్దిక్ కూడా ఈ ఫార్మాట్‌లో 100 వికెట్ల మైలురాయిని దాటడం గమనార్హం.