టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా ప్రయాణం ముగిసింది. అడిలైడ్‌లో జరిగిన సెమీస్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. ఈ ఏకపక్ష ఓటమి తర్వాత టీమ్ ఇండియా పేలవ ఆటతీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియా గత గణాంకాలను పరిసీలిస్తే.. 2013, 2014, 2016 T20 ప్రపంచకప్‌లో భారత్ నాకౌట్ రౌండ్‌లలో ఓడిపోగా.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచకప్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత్ ఫైనల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా అభిమానులు ఐసీసీ ట్రోఫీ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.. తదుపరి ఐసీసీ ట్రోఫీని టీమిండియా ఎప్పుడు గెలుస్తుందనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మరోసారి టీమిండియా ఓటమి పాలవ్వకుండా ఉండాలంటే.. జట్టులో ఈ 4 మార్పులు తప్పనిసరి. అవేంటంటే.
T20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు పవర్‌ప్లే రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. ఈ టోర్నీలో భారత్ పవర్‌ప్లేలో కేవలం 6.02 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. యూఏఈ తర్వాత అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. సెమీఫైనల్‌లోనూ భారత జట్టు పవర్‌ప్లే స్కోరు 38 పరుగులు కాగా, మరోవైపు పవర్‌ప్లేలో ఇంగ్లాండ్ 63 పరుగులు చేసింది. దీన్ని బట్టి చూస్తే పవర్‌ప్లేలో టీమ్ ఇండియా విధ్వంసకర ఆట తీరు చూపించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
దేశంలోని ‘అత్యుత్తమ’ 15 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లినా.. వారిని అవసరాన్ని తగ్గట్టుగా వాడుకోవడంలో టీం మేనేజ్‌మెంట్ విఫలమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ లెగ్ స్పిన్నర్లలో ఒకరైన యుజ్వేంద్ర చాహల్‌కు మొత్తం టోర్నీలో ఒక్క అవకాశం కూడా దక్కలేదు. తాజాగా టీ20ల్లో సెంచరీ సాధించిన దీపక్ హుడా లాంటి ఆటగాడికి భారత్ పూర్తి అవకాశాలు ఇవ్వలేదు. దినేష్ కార్తీక్, ఆ తర్వాత రిషబ్ పంత్‌కు కూడా సరిగ్గా అవకాశాలు దక్కలేదు. టీమ్ ఇండియాకు సరైన వ్యూహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న టోర్నీల్లో ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోవడంపై టీమిండియా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్ ఇలా టీ20 క్రికెట్‌లో తమ సత్తా చాలామంది నిరూపించుకున్నారు. కానీ ఈ టీ20 స్పెషలిస్ట్ ఆటగాళ్లకు ఎలాంటి అవకాశం దక్కలేదు, వచ్చినా ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోలేదు. వారికి బదులుగా, పెద్ద పేరున్న ఆటగాళ్లను ప్లేయింగ్ XIలో తీసుకున్నారు. ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి వారికి ఇకపై టీ20ల్లో చోటు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కెప్టెన్‌గా రోహిత్‌కు బీసీసీఐ ఉద్వాసన పలికే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ఈ ఓటమితో బోర్డు తన ఆలోచన కచ్చితంగా మార్చుకోవాలి. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో మాత్రమే ఆడటం కాదు.. ఇకపై విదేశీ లీగ్‌లలో కూడా ఆడాలి. BCCI తన ఆటగాళ్లను పెద్ద మనసుతో బయటకు లీగ్‌లకు కూడా పంపాలి. తద్వారా వారు విదేశీ పిచ్‌ల పరిస్థితులపై అవగాహన తెచ్చుకుని.. బాగా రాణించగలరు.