Gautam Gambhir: కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్.. ఏమన్నాడంటే?

గంభీర్ హయాంలో భారత్ ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో జట్టు ప్రదర్శన పడిపోవడం పెద్ద ఆందోళనగా మారింది. 2026లో టెస్టులు తక్కువగా ఉండటం గంభీర్‌కు కొంత ఊరట కలిగించే విషయమే అయినా, ఒకవేళ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విఫలమైతే ఆయన పదవికి ముప్పు తప్పకపోవచ్చు.

Gautam Gambhir: కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్.. ఏమన్నాడంటే?
Goutam Gambhir

Updated on: Jan 22, 2026 | 2:25 PM

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిన్న అర్థరాత్రి ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేశాడు. ఇందులో ఎవరి పేర్లను ప్రస్తావించకుండానే, తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం గమనార్హం. గత కొన్ని నెలలుగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టు నుంచి తప్పించడానికి గంభీర్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వారు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనే నిర్ణయం వెనుక, అలాగే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన వెనుక గంభీర్ హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులు, వన్డేల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న తరుణంలో, గంభీర్ కావాలనే కోహ్లీ, రోహిత్‌లను జట్టుకు దూరం చేయాలనుకుంటున్నారనే ఆరోపణలు పెరిగాయి.

గతంలో గంభీర్ మాట్లాడుతూ.. “2027 వరల్డ్ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఎవరికీ జట్టులో చోటు గ్యారెంటీ కాదు” అని వ్యాఖ్యానించారు. ఇది అందరికీ వర్తించనప్పటికీ, విమర్శకులు మాత్రం దీనిని కోహ్లీ, రోహిత్‌లకు వ్యతిరేకంగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, గంభీర్ మొదటిసారిగా పరోక్షంగా ఈ వివాదంపై స్పందించారు.

“దుమారం చల్లారిన తర్వాత, ఒక కోచ్‌కు ఉండే ‘అపరిమితమైన అధికారం’ గురించి అసలు నిజం అందరికీ అర్థమవుతుంది. అప్పటి వరకు, అత్యుత్తమ ఆటగాళ్లు, నా సొంత వాళ్ళైన వారితోనే నన్ను పోల్చడం నాకు వింతగా, విడ్డూరంగా అనిపిస్తోంది,” అని శశి థరూర్ చేసిన ఒక పోస్ట్‌కు సమాధానంగా గంభీర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

గంభీర్‌కు శశి థరూర్ మద్దతు..

భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత అత్యంత కష్టమైన పని గంభీర్‌దే అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభివర్ణించారు. నాగ్‌పూర్‌లో భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 ప్రారంభానికి ముందు గంభీర్‌ను కలిసిన థరూర్, గంభీర్ ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నారని, ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

గంభీర్ ఎదుర్కొంటున్న ఆరోపణలు:

రోహిత్ – గంభీర్ మధ్య దూరం: రోహిత్ శర్మ, గంభీర్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ప్రాక్టీస్ సెషన్లలో కూడా వారు ఒకరినొకరు ఎదురుపడటం లేదని వార్తలు వచ్చాయి. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన సమయంలో వీరిద్దరి మధ్య మాటలు పూర్తిగా నిలిచిపోయాయని ‘దైనిక్ జాగరణ్’ నివేదించింది.

కోహ్లీతో విభేదాలు: ఒకప్పుడు నవ్వుతూ మాట్లాడుకున్న కోహ్లీ, గంభీర్.. ఇప్పుడు కేవలం అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుకుంటున్నారని సమాచారం.

పదవిపై స్పష్టత: డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఓటమి తర్వాత, తాను సొంతంగా తప్పుకోనని, ఒకవేళ బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే దానికి గౌరవిస్తానని గంభీర్ స్పష్టం చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..