
Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఎఇలో జరిగే టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా ప్రవేశిస్తుంది. 2023లో ఈ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌నకు ముందు ఆసియా కప్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గౌతమ్ గంభీర్ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో కోచ్‌గా ప్రారంభించాడు. ఇప్పుడు అతను మరో పెద్ద టైటిల్‌పై దృష్టి పెట్టాడు. దీని కోసం అతను ప్రత్యేక సన్నాహాలు కూడా చేస్తున్నాడు.
గంభీర్ కోచింగ్ శైలిలో ఆల్ రౌండర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. బ్యాట్‌తో పాటు బంతితో కూడా బాగా రాణించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను జట్టులో వీలైనంత ఎక్కువ మంది ఉండాలని అతను కోరుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గంభీర్ కూడా అదే చేశాడు. చాలా విమర్శలు వచ్చినప్పటికీ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులో ఉంచుకున్నాడు. దీని వల్ల జట్టు ప్రయోజనం పొందింది. సుందర్ కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు భారత్‌లో ఆసియా కప్ కోసం ఆల్ రౌండర్ల సైన్యం ఉంది. వారిలో రెండు లేదా గరిష్టంగా ముగ్గురు మాత్రమే ఆసియా కప్ కోసం UAEకి వెళ్లగలరు. టీం ఇండియాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం గాయపడి ఈ రేసుకు దూరంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, గంభీర్ హార్దిక్, అక్షర్, శివమ్, సుందర్ నుంచి 2 లేదా 3 మందిని ఎంచుకోవలసి ఉంటుంది.
హార్దిక్ పాండ్యా: ప్రస్తుతం ప్రపంచ టాప్ ఆల్ రౌండర్ గా పరిగణించబడుతున్న హార్దిక్ పాండ్యాకు జట్టులో స్థానం ఖాయమైంది. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్, ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అతను సభ్యుడు. భారతదేశం తరపున 114 మ్యాచ్ ల్లో 1812 పరుగులు సాధించి, 94 వికెట్లు కూడా పడగొట్టాడు. గత ఐపీఎల్ లో హార్దిక్ 15 మ్యాచ్‌ల్లో 224 పరుగులు చేశాడు. 14 వికెట్లు పడగొట్టాడు.
అక్షర్ పటేల్: హార్దిక్ తర్వాత, టీ20 జట్టులో మరే ఇతర ఆల్ రౌండర్ స్థానం నిర్ధారించబడితే, అది అక్షర్ పటేల్. టీ20 ప్రపంచ కప్ విజయంలో గణనీయమైన పాత్ర పోషించిన అక్షర్, ఓపికతో పాటు త్వరగా పరుగులు సాధించగలడు. తన స్పిన్ ఆడటం ఎవరికీ సులభం కాదు. అతను భారతదేశం తరపున 71 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేశాడు. అలాగే 71 వికెట్లు కూడా తీసుకున్నాడు.
శివమ్ దూబే: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరపున ఆడిన శివమ్ దూబే టీ20 జట్టులోకి వస్తూనే ఉన్నాడు. అతని స్థానం ఎప్పుడూ శాశ్వతం కాదు. శివమ్ దూబే జట్టులో ఎంపికైతే అది పెద్ద ఆశ్చర్యం కలిగిస్తుంది. టీమ్ ఇండియా తరపున శివమ్ 35 మ్యాచ్‌ల్లో 531 పరుగులు చేశాడు. 13 వికెట్లు పడగొట్టాడు.
వాషింగ్టన్ సుందర్: టీం ఇండియా కోచ్ గంభీర్ ఇటీవలి కాలంలో ఆల్ రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను చాలా ఇష్టపడుతున్నాడు. అతను యుఎఇ పిచ్ లపై ఎక్స్-ఫ్యాక్టర్ అని నిరూపించుకోగలడు. ఇటువంటి పరిస్థితిలో, గంభీర్ అతన్ని ఆసియా కప్‌నకు తీసుకెళ్లగలడు. సుందర్ టీం ఇండియా తరపున 54 టి20 మ్యాచ్ ల్లో 193 పరుగులు చేయడంతో పాటు 48 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..