
Rohit Sharma Statement After Final: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండుసార్లు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఫైనల్లో రోహిత్ అద్భుతంగా రాణించి 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఇదిలా ఉండగా, ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతాడని చాలా వార్తలు వినిపించాయి. వీటన్నింటికి రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశాడు.
ఫైనల్లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడనే పుకార్లు షికార్లు చేశాయి. కాగా, 2024 ప్రపంచ కప్‌లో భారతదేశాన్ని టైటిల్ విజయానికి నడిపించిన తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ కూడా అలాగే చేస్తాడని చాలా మంది అభిమానులు ఆశించారు.
కానీ, రోహిత్ వన్డేల నుంచి రిటైర్ అయ్యే ఆలోచన లేదంటూ కుండ బద్దలు కొట్టాడు. ఫైనల్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ, తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని ధృవీకరించాడు. “భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రస్తుతానికి, ప్రతిదీ యథావిధిగా కొనసాగుతుంది” అంటూ భారత కెప్టెన్ పుకార్లకు చెక్ పెట్టేశాడు.
ఆస్ట్రేలియాలో రోహిత్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. దీంతో టెస్ట్ జట్టులో అతని స్థానం ఇప్పటికీ సందేహాస్పదంగా ఉంది. అలాగే ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతను ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ రోహిత్ టెస్ట్ జట్టులో ఎంపిక కాకపోతే, ఆగస్టు 2025లో బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ తరపున తన తదుపరి మ్యాచ్ ఆడతాడు. రోహిత్ ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటాడు. ఆ తర్వాత ఐపీఎల్ (IPL 2025) లో ఆడతాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున ఆడటం చూడొచ్చు.
రవీంద్ర జడేజా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావొచ్చని కూడా పుకార్లు వచ్చాయి. కానీ, అది జరగలేదు. టైటిల్ గెలిచిన తర్వాత జడేజా హర్ష భోగ్లేతో మాట్లాడాడు. రిటైర్మెంట్ గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలని భారత ఆటగాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చాలా మంది సీనియర్ ఆటగాళ్ళు తదుపరి 50 ఓవర్ల ఐసీసీ ఈవెంట్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..