
Team India : ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా నిరాశాజనక ప్రదర్శన చేసిన నేపథ్యంలో బీసీసీఐ నిర్వహించాల్సిన కీలకమైన రివ్యూ మీటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. మీడియా కథనాల ప్రకారం.. బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అనారోగ్యానికి గురికావడమే ఇందుకు ప్రధాన కారణం. త్వరలోనే ఈ సమావేశం నిర్వహించేందుకు కొత్త తేదీని ప్రకటించనున్నారు. ఈ కీలక భేటీకి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
విదేశీ పర్యటనల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా
టి20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు నుంచి అభిమానులు ఎంతో ఆశించినప్పటికీ, ఇటీవలి విదేశీ పర్యటనలు ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో కలిపి భారత జట్టు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. శ్రేయస్ అయ్యర్ మొదటిసారి టి20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 2-0 తో కోల్పోయి క్లీన్ స్వీప్‌నకు గురైంది.
ఇంగ్లాండ్ గడ్డపై టి20, వన్డే సిరీస్‌లు రద్దు
ఐర్లాండ్ పరాజయం తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ కూడా తేలిపోయింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కోల్పోగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా భారత్ 2-1 తేడాతో ఇంగ్లాండ్‌కు అప్పగించింది. ప్రధాన ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ ఈ స్థాయిలో విఫలం కావడం అభిమానులతో పాటు బిసిసిఐ పెద్దలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
బ్యాటర్ల వైఫల్యం, కోచ్ గంభీర్ వ్యాఖ్యలు
ఈ పర్యటనల్లో భారత బ్యాటర్ల వైఫల్యమే తీవ్ర విమర్శలకు దారితీసింది. ఐపీఎల్ 2026, స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్‌కు ముందు నిరంతరం ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం వల్లే, విదేశీ మైదానాల్లో కష్టమైన పరిస్థితులకు తగ్గట్లు బ్యాటర్లు సర్దుబాటు చేసుకోలేకపోయారని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనిపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ఆటగాళ్లు కేవలం పిచ్ స్వభావాన్నే కాకుండా, మ్యాచ్ పరిస్థితులు, గాలి దిశ మరియు మైదానం పరిమాణం వంటి విషయాలను కూడా బాగా అర్థం చేసుకోవాల్సి ఉందనడంలో సందేహం లేదని అంగీకరించారు.
ప్లేయర్ల గాయాల సమస్యపై పెరిగిన ఆందోళన
ఈ రివ్యూ మీటింగులో టీంలోని మెయిన్ ప్లేయర్లు వరుసగా గాయపడటంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవలే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరమవ్వగా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు కూడా గాయాల బారిన పడి కోలుకుంటున్నారు. కీలక ఆటగాళ్లు పదే పదే గాయాల పాలుకావడంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గంభీర్ అసంతృప్తితో ఉన్నారని, ఈ నేపథ్యంలో టీమ్ ఫిజియో కమ్లేష్ జైన్ పనితీరుపై కూడా బిసిసిఐ ప్రశ్నలు గుప్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..