దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన జాడేజా వచ్చీ రాగానే ఆసీస్ ఆటగాళ్ల పాలిట పెద్ద పెనుముప్పులా మారాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. అంతేకాక అతను లేకపోవడం అంటే జట్టుకే నష్టం అని చాటి చెప్పాడు. తన బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ చేసి టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు జడేజా. దీంతో ఫిబ్రవరి నెలకుగాను జడేజా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచాడు. ఇంకా అతనితో పాటు ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్, వెస్టిండీస్ ప్లేయర్ గుడకేష్ మోటీ కూడా ఈ రేసులో నామినేట్ అయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా బౌలింగ్ అటాక్‌ను ముందుండి నడిపిస్తున్న జడేజా.. రెండో టెస్టులో ఏకంగా 10 వికెట్లను పడగొట్టాడు.
ఇక ఈ సిరీస్‌లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన వారిలో జడేజా టాప్ స్థానంలో ఉండగా.. 19 వికట్లతో నాథన్ లియాన్ రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 70 పరుగులు చేసిన జడేజా.. మూడు టెస్టుల్లో 107 పరుగులు రాబట్టాడు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే జడేజా 17 వికెట్లతో పాటు ఓ హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలవడం విశేషం. అయితే ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించిన జడేజా రానున్న నాల్గో మ్యాచ్‌లో కూడా రాణించవలసి ఉంది. ఎందుకంటే రానున్న మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకమైనది. ఆ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది. అందువల్ల జడేజా మరోసారి తన బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ షో చేయవలసి ఉంది.
మరోవైపు ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్ట్ క్రికెట్‌లో రికార్డులు తిరగరాస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో ఇప్పటికే ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన అతడు.. మరోసారి రేసులో ఉన్నాడు. తన కెరీర్‌లో ఆడిన తొలి 9 టెస్టుల్లోనే 800కు పైగా రన్స్ చేసి హిస్టరీ కూడా క్రియేట్ చేశాడు బ్రూక్. ఈ మధ్యే న్యూజిలాండ్ సిరీస్‌లోనూ ఇంగ్లండ్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండు టెస్టుల ఆ సిరీస్‌లో అతను 329 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 186 పరుగులు రాబట్టడం చెప్పుకోదగిన ఇన్నింగ్స్. అటు వెస్టిండీస్ బౌలర్ గుడకేష్ మోటీ కూడా తన లెఫ్టామ్ స్పిన్‌తో మాయ చేస్తున్నాడు. జింబాబ్వేపై రెండు టెస్టుల సిరీస్‌లో 19 వికెట్లు తీసుకున్న అతను.. రెండో టెస్టులో ఏకంగా 13 వికెట్లు తీయడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ స్పిన్నర్‌కు ఇదే బెస్ట్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..