సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్.. గాయపడిన మరో ప్లేయర్..?

Team India Injury Update: నాలుగు విజయాలతో భారత జట్టు సూపర్ 8 దశకు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఓ స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్.. గాయపడిన మరో ప్లేయర్..?
Team India

Updated on: Feb 21, 2026 | 12:16 PM

Team India Injury Update: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు మరో గాయ భయం వెంటాడుతోంది. సూపర్-8 దశలో సౌతాఫ్రికాతో కీలక మ్యాచ్‌కు ముందు భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి నేరుగా సిరాజ్ మోకాళ్లకు తగలడంతో ఆయన తీవ్ర నొప్పితో కిందపడినట్లు సమాచారం.

నొప్పితో విలవిల్లాడుతున్న సిరాజ్‌ను చూసి వెంటనే టీమ్ సపోర్ట్ స్టాఫ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక వైద్య సహాయం అందించారు. అయితే, ఈ గాయంపై ఇప్పటివరకు అధికారికంగా బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మహ్మద్ సిరాజ్ ఎలా గాయపడ్డాడు..?

నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా, హార్దిక్ పాండ్యా బలంగా కొట్టిన షాట్ వేగంగా సిరాజ్ వైపుకే దూసుకువచ్చింది. బంతి వేగంగా రావడంతో సిరాజ్ తాను రక్షించుకునేందుకు తగినంత సమయం దొరకలేదు. దీంతో ఆ బంతి నేరుగా మోకాళ్లకు తగిలింది. సిరాజ్ ముఖంలో కనిపించిన నొప్పి ఈ గాయం తీవ్రతను సూచిస్తోంది.

హర్షిత్ రాణా గాయపడిన తర్వాత సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. మొదటగా బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్‌లో సిరాజ్ పేరు లేదు. కానీ, రాణా గాయంతో హైదరాబాద్‌కు చెందిన ఈ పేసర్‌ను జట్టులో చేర్చారు. యునైటెడ్ స్టేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మంచి ప్రదర్శన చూపించాడు.

ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ గాయాల భయం..

ఇటీవలే నెట్స్‌లో ఇషాన్ కిషన్ కూడా స్వల్పంగా గాయపడిన విషయం అభిమానులను కలవరపెట్టింది. అయితే, అది పెద్దగా తీవ్రత కలిగిన గాయం కాకపోవడంతో ఇషాన్ తిరిగి జట్టులో రాణిస్తున్నాడు.

ఇక అభిషేక్ శర్మ ఆరోగ్య సమస్యలు మాత్రం టీమిండియాకు నిజమైన టెన్షన్‌ను ఇచ్చాయి. టోర్నీ ప్రారంభానికి ముందు అతనికి కడుపునొప్పి (స్టమక్ అప్‌సెట్) రావడంతో నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడినా అభిషేక్ శర్మ ఇంకా ఈ టోర్నీలో తన ఖాతా తెరవలేకపోయాడు.

సూపర్-8లో సౌతాఫ్రికాతో కీలక పోరు..

టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ సూపర్-8 దశలో సౌతాఫ్రికాతో జరగనుంది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలక పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు సిరాజ్ గాయంపై క్లారిటీ రావడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు చాలా కీలకం కానుంది. సిరాజ్ ఆడకపోతే భారత బౌలింగ్ దళానికి అది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us