2024 T20 World Cup: ఐసీసీ సూపర్ స్కెచ్.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఆ దేశంలో? గ్లోబల్ ఈవెంట్‌గా మార్చేందుకు నానా తంటాలు..!

|

Nov 12, 2021 | 9:25 AM

ICC: దీనిపై ఐసీసీ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ దేశాన్ని ఎంచుకోవడం వెనుక ఒకే బాణంతో ఎన్నో లక్ష్యాలను చేధించాలని ఐసీసీ భావిస్తోంది.

2024 T20 World Cup: ఐసీసీ సూపర్ స్కెచ్.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఆ దేశంలో? గ్లోబల్ ఈవెంట్‌గా మార్చేందుకు నానా తంటాలు..!
T20 World Cup
Follow us on

T20 World Cup 2024: పాపువా న్యూ గినియా, ఒమన్, నమీబియా వంటి కొత్త జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021లో చోటు సంపాదించి, క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్ర వేశాయి. ఈ కొత్త జట్ల రాకతో క్రికెట్ మరింత విస్తృతం కావాలనే ఐసీసీ కోరిక కూడా ఆశ నెరవేరింది. అయితే ఇప్పటికీ ఈ గేమ్ ప్రపంచంలోని అనేక ఇతర క్రీడలు తమదైన ముద్ర వేసిన మార్కెట్‌లోకి ప్రవేశించలేకపోవడంతో.. ఈ గేమ్ ద్వారా ఐసీసీ కూడా పెద్ద ఆదాయాన్ని పొందలేకపోతోంది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)లో ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆట తన సత్తా చాటుతోంది. క్రమంగా ఈ ఆటకు యూఎస్‌ఏలో ప్రాచుర్యం పొందుతోంది. దీనిని ఆసరా చేసుకుని మరింత ప్రాచుర్యం పొందేందుకు ఐసీసీ మరో పెద్ద అడుగు వేయనుంది. ఈ మేరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను యూఎస్‌లో నిర్వహించే ఆలోచనలో ఉంది. తద్వారా క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ఆదాయాలను పెంచుకునేందుకు ఐసీసీ సూపర్ స్కెచ్ వేస్తోంది.

బీసీసీఐ ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత, అదే టోర్నమెంట్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ తన తదుపరి టోర్నమెంట్ సైకిల్‌లో 2024లో టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే దీనిని యూఎస్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికాలో ఈ గేమ్‌ను ప్రోత్సహించేందుకు, క్రికెట్‌లోని అపెక్స్ బాడీ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించే బాధ్యతను అమెరికన్ క్రికెట్ బోర్డుకు అప్పగించవచ్చని ఒక నివేదిక పేర్కొంది.

అమెరికా, వెస్టిండీస్ జాయింట్ హోస్టింగ్ పొందే అవకాశం..
క్రికెట్ వెస్టిండీస్ (CWI), క్రికెట్ యూఎస్‌ఏ (USA క్రికెట్) సంయుక్తంగా 2024లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఉమ్మడి బిడ్‌ను వేశాయని క్రికెట్ పోర్టల్ క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. ఐసీసీ 2024 టోర్నమెంట్‌ను నిర్వహించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో టీ20 ఫార్మాట్ ద్వారా వీలైనన్ని ఎక్కువ దేశాలకు చేరుకోవడానికి దాని ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని, ఐసీసీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. ఈ ఉమ్మడి బిడ్‌ను ఆమెదించే అవకాశం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఆమోదం పొందినట్లయితే అమెరికాలో జరిగే మొదటి గ్లోబల్ ఈవెంట్‌గా రికార్డు నెలకొల్పనుంది. క్రికెట్ వెస్టిండీస్ ఇప్పటికే 2007లో వన్డే ప్రపంచకప్, 2010లో టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది.

చాలా మంది ఆసియా ఆటగాళ్లు అమెరికాలోనే..
ఇటీవలి కాలంలో భారతదేశం, శ్రీలంకతో సహా కొన్ని దక్షిణాసియా దేశాల నుంచి దేశీయ క్రికెటర్లు యుఎస్‌కు వెళ్లారు. అక్కడ వారు యుఎస్ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్ది వారాల క్రితమే భారత మాజీ అండర్-19 ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అమెరికా వెళ్లి అక్కడ దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో అమెరికాలో ఆటకు ఆదరణ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

2028 ఒలింపిక్స్‌పై దృష్టి..
అలాగే ఈ చర్య ద్వారా 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల కోసం ఐసీసీ తన వాదనను బలపరచాలనుకుంటోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో చేర్చాలని ఐసీసీ ఇప్పటికే తన వాదనను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Pak vs Aus: 2010లో మైఖేల్ హస్సీ.. 2021లో మాథ్యూ వేడ్.. 11 ఏళ్ల పాకిస్తాన్ ఆశలను చిదిమేసిన ఆసీస్ ఆటగాళ్లు..!

16 ఏళ్ల వయసులో క్యాన్సర్‌.. దానికి తోడు కలర్ బ్లైండ్.. జట్టులో ప్లేసే కరవు.. ప్రస్తుతం 3 బంతుల్లో సూపర్ హీరోగా మారిన ఆసీస్ బ్యాట్స్‌మెన్