IND vs ENG: రోహిత్ ముందుగా అక్కడ ఓడితేనే.. టీమిండియా ఫైనల్ చేరేది.. ఎలాగో తెలుసా?

|

Nov 09, 2022 | 1:42 PM

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా 15 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను గెలవాలని చూస్తోంది. అయితే అంతకంటే ముందు బలమైన ఇంగ్లాండ్‌ జట్టుపై గెలవాల్సిన అవసరం ఉంది.

IND vs ENG: రోహిత్ ముందుగా అక్కడ ఓడితేనే.. టీమిండియా ఫైనల్ చేరేది.. ఎలాగో తెలుసా?
Team India
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022(T20 World Cup 2022) చివరి దశకు చేరుకుంది. ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న అడిలైడ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. తమ స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా.. 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సెమీస్ చేరిన రోహిత్ సేన జోస్ బట్లర్ బలమైన జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాలోని ప్రతి ఆటగాడి పాత్ర కీలకం కానుండడంతో పాటు టాస్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

నిజానికి టాస్ ఓటమితోనే భారత్‌కు ఫైనల్‌ తలుపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 11 టాస్‌ల రికార్డులు చూస్తే ఇదే అనిపిస్తోంది. అడిలైడ్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. టాస్ ఓడితే.. మ్యాచ్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన జట్టుదే విజయం..

అడిలైడ్‌లో 11 అంతర్జాతీయ పురుషుల టీ20 మ్యాచ్‌లు ఆడగా మొత్తం 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన టీంలే గెలిచాయి. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ రికార్డును పరిశీలిస్తే భారత్ విజయం సాధించి, ఫైనల్ చేరాలంటే టాస్ ఓడిపోవడం కీలకంగా మారింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అలాంటి మ్యాచ్‌లు కూడా కనిపించాయి. అయితే, ఫలితం గురించి ఆలోచించకుండా.. జట్టు బలమైన ప్రదర్శనతో గత రికార్డులను తప్పుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అదే ఇప్పుడు భారత్ వంతు కూడా రావొచ్చు. టాస్‌కు అనుకూలమైనప్పటికీ, ఈ రికార్డును మార్చాల్సిన బాధ్యత భారత జట్టుపై ఉంది.

రోహిత్‌, విరాట్ గాయాలతో టెన్షన్..

సెమీఫైనల్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీ గాయాలు అందరినీ భయపెట్టింది. అయితే, రోహిత్ మాత్రం పూర్తిగా కోలుకుని సెమీఫైనల్‌కు సిద్ధమయ్యాడు. నెట్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడిన హిట్‌మ్యాన్, సుమారు 40 నిమిషాల పాటు ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను మరోసారి జట్టు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే కోహ్లీ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో హర్షల్ బౌలింగ్‌లో దెబ్బ తగిలింది. దీంతో గజ్జల్లో గాయంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో అభిమానులు, మేనేజ్‌మెంట్ కాస్త ఆందోళన చెందింది. అయితే, అంతగా కంగారుపడాల్సిన పనిలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త విశ్రాంతి తీసుకున్న విరాట్.. మరోసారి బ్యాటింగ్ చేయకుండా, అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు. సెమీస్‌లో కచ్చితంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాడు.

చరిత్ర సృష్టించేందుకు 2 అడుగులు దూరంలో రోహిత్ సేన..

భారత జట్టు చరిత్ర సృష్టించడానికి కేవలం 2 అడుగుల దూరంలో ఉంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్‌ గెలుపొందడంపైనే అందరి దృష్టి నెలకొంది. అయితే అంతకంటే ముందు భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. టోర్నీ టైటిల్ మ్యాచ్ నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..