T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చూసి న్యూజిలాండ్ కాకుండా ఎవరైనా బాధపడ్డారంటే అది కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ మాత్రమే. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ వీర విహారం చేశాడు. అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియాకు వార్నర్ శుభారంభం అందించాడు. కేవలం 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 139. 47. అతడి విజృంభణతో ఆస్ట్రేలియా మొదటిసారి T20లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
ప్రపంచకప్‌కు ముందు వార్నర్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విషయం వాస్తవమే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని మొదట జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరం చేసింది. కానీ వార్నర్ క్రికెట్‌లో తానేంటో మరోసారి నిరూపించాడు. తనను తొలగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గట్టి సమాధానమిచ్చాడు. తన విలువేంటో మరోసారి గుర్తు చేశాడు. ఫైనల్‌లో కెప్టెన్ ఫించ్ తొందరగానే ఔట్ అయినప్పుడు వార్నర్ ఆ బాధ్యతను స్వీకరించాడు.
జట్టుని ముందుండి నడిపించాడు. ఆటగాళ్లు ఎవ్వరూ ఒత్తిడికి లోనుకాకుండా ఆ బాధ్యతను తను భుజాలపై వేసుకున్నాడు. జట్టుని విజయానికి చేరువ చేశాడు. కీలక సమయంలో తన ఆటతీరుని ప్రదర్శించాడు. టీ 20 ప్రపంచకప్‌లో ఏకంగా మ్యాన్ ఆప్ ద సిరిస్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో 48.17 సగటుతో 289 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 32 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు తన పెర్ఫార్మెన్స్‌తో వచ్చే ఏడాది మెగా వేలానికి సిద్దమయ్యాడు. అందరు ఆటగాళ్ల కన్నా ముందువరుసలో నిలిచాడు.