T20 World Cup 2026 : 1996 నుంచి కొనసాగిన లంక సెంటిమెంట్ కు ఎండ్ కార్డు.. శ్రీలంకకు తీరని అవమానం

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఒక సూపర్ హిట్ సినిమాను తలపిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోల కంటే ట్విస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటికి వెళ్లగా, ఇప్పుడు టోర్నీ ఆతిథ్య దేశాలకు కూడా గడ్డు కాలం నడుస్తోంది.

T20 World Cup 2026 : 1996 నుంచి కొనసాగిన లంక సెంటిమెంట్ కు ఎండ్ కార్డు.. శ్రీలంకకు తీరని అవమానం
Sri Lanka

Updated on: Feb 26, 2026 | 11:00 AM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఒక సూపర్ హిట్ సినిమాను తలపిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోల కంటే ట్విస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటికి వెళ్లగా, ఇప్పుడు టోర్నీ ఆతిథ్య దేశాలకు కూడా గడ్డు కాలం నడుస్తోంది. భారత్ సెమీస్ చేరాలంటే చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొనగా, మరో ఆతిథ్య దేశం శ్రీలంక కథ మాత్రం అప్పుడే ముగిసిపోయింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన లంక, తమ సొంత గడ్డపైనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది ఆ జట్టుకు కేవలం ఓటమి మాత్రమే కాదు, 30 ఏళ్ల ఘనమైన రికార్డుకు పడిన ముగింపు పలకడం విశేషం.

కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో కివీస్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక చేతులెత్తేసింది. కేవలం 107 పరుగులకే కుప్పకూలి 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. సూపర్ 8లో వరుసగా రెండో ఓటమిని చవిచూడటంతో సెమీస్ రేసు నుంచి లంక అధికారికంగా తప్పుకుంది. దీంతో శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అప్రతిష్టాత్మక రికార్డు నమోదైంది. ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తూ.. ఫైనల్ చేరకుండానే లంక ఇంటిదారి పట్టడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.

శ్రీలంకకు ఆతిథ్య దేశంగా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. 1996లో భారత్, పాకిస్థాన్‌లతో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు లంక ఏకంగా టైటిల్ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత 2002లో ఒంటరిగా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించి, భారత్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఇక 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆతిథ్య జట్టుగా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. చివరికి 2012లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు కూడా ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ చేజార్చుకుంది. అంటే గత మూడు దశాబ్దాలుగా ఏ ఐసీసీ టోర్నీకి లంక ఆతిథ్యం ఇచ్చినా కచ్చితంగా ఫైనల్ ఆడేది. కానీ ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్ బద్ధలైపోయింది.

సొంత ప్రేక్షకుల మధ్యే ఘోరంగా విఫలమవ్వడం లంక అభిమానులను కలిచివేస్తోంది. కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర ధాటికి లంక బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. అటు భారత్ కూడా సెమీస్ కోసం కష్టపడుతున్న తరుణంలో, మరో ఆతిథ్య దేశం ఇలా మధ్యలోనే నిష్క్రమించడం టోర్నీలో పెద్ద యాంటీ క్లైమాక్స్‌గా నిలిచింది. ఈ ఓటమితో శ్రీలంక క్రికెట్‌లో ఒక స్వర్ణయుగం ముగిసిందా అన్న చర్చ మొదలైంది. ఇకనైనా ఆ జట్టు తన లోపాలను సరిదిద్దుకుని మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us