IND Vs ENG: ‘వాడే మాకు యముడయ్యాడు.! మ్యాచ్ పోయిందనుకున్నా కానీ అక్కడే మలుపు తిరిగింది’

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2026 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ బ్యాటింగ్, బుమ్రా బౌలింగ్, అక్షర్ పటేల్ అద్భుతమైన ఫీల్డింగ్ కీలకంగా నిలిచాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

IND Vs ENG: వాడే మాకు యముడయ్యాడు.! మ్యాచ్ పోయిందనుకున్నా కానీ అక్కడే మలుపు తిరిగింది
Surya Kumar Yadav

Updated on: Mar 06, 2026 | 2:00 PM

2026 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య తీవ్ర ఉత్కంఠభరితంగా జరిగింది. చివరి ఓవర్ల వరకు విజయం ఏ జట్టును వరిస్తుందో ఊహించలేని రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారీగా 253 పరుగులు చేసింది. ఈ కష్టమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు గట్టి పోటీనిచ్చింది, అయితే 246 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.

భారత్ బ్యాటింగ్‌లో సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఆరంభంలోనే వికెట్లు పడినా, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని గ్రహించి అతను దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన టీమిండియా బ్యాటర్లు కూడా అదే జోరును కొనసాగించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా తన పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగా, హార్దిక్ పాండ్యా తన చాకచక్యమైన బౌలింగ్‌తో కీలక వికెట్లు తీశాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో విజేతగా నిలవడంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ విన్యాసాలు అతి కీలక పాత్ర పోషించాయి. ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న ప్రతిసారి, అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి. హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి వెళ్లి, ఎగిరి డ్రైవ్ చేస్తూ పట్టడం అద్భుతంగా నిలిచింది. అలాగే, విల్ జాక్స్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద అందుకుని శివమ్ దూబేకు అందించిన తీరు వర్ణనాతీతం. జాక్ బెతెల్ సెంచరీతో చెలరేగుతున్న దశలో హార్దిక్ పాండ్యా చేసిన అద్భుతమైన రనౌట్ కూడా టీమిండియా విజయంలో ఒక కీలక మలుపు. అక్షర్ పటేల్ మూడు కీలకమైన క్యాచ్‌లు పట్టి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌లు పట్టడం అసాధ్యమైనా, అక్షర్ పటేల్ వాటిని సుసాధ్యం చేశాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు. దీనికి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్‌కు క్రెడిట్ ఇవ్వాలని కూడా పేర్కొన్నాడు.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, ఇంగ్లాండ్‌పై గెలవడం ఒక నమ్మశక్యం కాని అనుభూతి అని పేర్కొన్నాడు. ఇంత గొప్ప జట్టుకు నాయకత్వం వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం ఆటగాళ్లందరికీ ఒక ప్రత్యేకమైన భావన అని చెప్పాడు. సంజు శాంసన్ స్పష్టమైన అవగాహనతో బ్యాటింగ్ చేశాడని, ఆరంభంలో వికెట్లు పడినా, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని అతను గుర్తించి అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. ఇంగ్లాండ్‌పై గెలవాలంటే ఇంకా ఎన్ని పరుగులు చేసి ఉండాలో అని ఒక దశలో అనిపించిందని, అయితే జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ వంటి బౌలర్లు అద్భుతంగా కట్టడి చేసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పారని సూర్యకుమార్ వివరించాడు. మొత్తంగా, జట్టు సమిష్టిగా పోరాడడంతో ఫైనల్‌కు చేరుకున్నామని, ఇక కప్పుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచామని సూర్యకుమార్ యాదవ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఇది చదవండి: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

Follow Us