Suryakumar Yadav : ఆసియా కప్‌కు ముందు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన కెప్టెన్

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటనకు ముందే ఇంత కాలంగా వేధిస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం దొరికింది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో మొదలయ్యే ఈ టోర్నీలో టీమ్ ఇండియాకు ఎవరు కెప్టెన్‌గా ఉంటారనే దానిపై స్పష్టత వచ్చింది.

Suryakumar Yadav :  ఆసియా కప్‌కు ముందు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన కెప్టెన్
Suryakumar Yadav

Updated on: Aug 17, 2025 | 10:37 AM

Suryakumar Yadav : క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా జట్టు ప్రకటనకు ముందు ఒక పెద్ద సందిగ్ధతకు సమాధానం దొరికింది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతాడా లేదా మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అన్న ప్రశ్నకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అవ్వడంతో, ఏషియా కప్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా అతడే వ్యవహరించనున్నాడని అధికారికంగా తేలిపోయింది.

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొన్ని వారాల క్రితం హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి రిహాబిలిటేషన్‌లో ఉన్న ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఇటీవల బెంగళూరులోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో సూర్యకుమార్ ఫిట్‌గా ఉన్నట్లు తేలిందని ఆ నివేదికలో వెల్లడించారు.

సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉండటం సెలక్షన్ కమిటీకి పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే ఆగస్టు 19న ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్‌ను సెలక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే సూర్యకుమార్ తిరిగి రావడం జట్టు బ్యాటింగ్‌కు కూడా బలాన్నిస్తుంది. బీసీసీఐ వర్గాల ప్రకారం.. ఫిట్‌నెస్ సాధించిన సూర్యకుమార్ జట్టు పగ్గాలు చేపడతారని, సెలక్షన్ కమిటీ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న సమావేశమై ఏషియా కప్ కోసం తుది జట్టును ఎంపిక చేయనుంది. సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించడంతో సెలెక్టర్లకు ఒక సమస్య తీరినప్పటికీ, మరో పెద్ద ప్రశ్న ఇంకా అలాగే ఉంది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ను జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా లేకపోతే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సూర్యకుమార్ ఫిట్‌నెస్ సాధించడంతో, గిల్ ఎంపికపై సందిగ్ధత నెలకొంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..