SRH : ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఇద్దరు ఔట్.. ఐపీఎల్ 2026లో కీలక మార్పులతో బరిలోకి.. ఎవరంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌ను నియమించింది. ఈ నియామకం తర్వాత, వరుణ్ ఆరోన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2025 సమయంలో, నిపుణుడిగా ఉన్న వరుణ్ ఆరోన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్‌లను SRH రిలీజ్ చేస్తుందని అంచనా వేశాడు.

SRH : ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఇద్దరు ఔట్.. ఐపీఎల్ 2026లో కీలక మార్పులతో బరిలోకి.. ఎవరంటే?
Mohammed Shami

Updated on: Jul 15, 2025 | 8:22 PM

SRH : ఐపీఎల్ 2024 ఫైనలిస్ట్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పులు జరుగనున్నాయి. గత సీజన్‌లో ఎస్ఆర్‎హెచ్ ప్రదర్శన నిరాశపరిచింది. దీంతో హైదరాబాద్ జట్టు తమ కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‎ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అతను జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో బౌలింగ్ కోచ్‌గా వచ్చాడు. ఇప్పుడు వరుణ్ ఆరోన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వరుణ్ ఆరోన్ ఐపీఎల్ 2025 సమయంలో ESPNcricinfoలో మాట్లాడుతూ.., మహ్మద్ షమీని హైదరాబాద్ జట్టు రిలీజ్ చేస్తుందని అంచనా వేశాడు. తన మాట్లాడుతూ.. “నేను మహ్మద్ షమీని రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అతను తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు.. వరుసగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. బహుశా ఇషాన్ కిషన్ కూడా రిలీజ్ కావచ్చు. ఇషాన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అతన్ని మళ్లీ వేలంలోకి పంపి తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి” అని వరుణ్ ఆరోన్ అప్పట్లో కామెంట్ చేశాడు.

అప్పట్లో వరుణ్ ఆరోన్ ఒక నిపుణుడిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడు. అతను ఏ జట్టులోనూ భాగం కాదు. కానీ ఇప్పుడు అతను ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్‌గా నియమితులైన తర్వాత, అతని పాత వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసి 9 వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్ 2025లో హైదరాబాద్ జట్టు అతనిని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతను 9 మ్యాచ్‌లలో కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

ఇషాన్ కిషన్ మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు తమ జట్టులోకి తీసుకుంది. 2025 సీజన్‌లో అతను 14 మ్యాచ్‌లలో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన వారి భారీ ధరలకు తగ్గట్టుగా లేకపోవడంతో వరుణ్ ఆరోన్ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు వరుణ్ ఆరోన్ కోచ్‌గా ఉన్నాడు కాబట్టి, అతని గత అంచనాలు నిజమవుతాయా లేదా అనేది చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..