గాలె టెస్టులో శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దినేష్ చండిమాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అభిమానులందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా బలమైన బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొంటూ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ డబుల్ సెంచరీతో దినేష్ చండిమాల్ భారీ రికార్డు సృష్టించాడు. అయితే దీనితో పాటు అతను కొట్టిన ఓ సిక్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి దినేష్ చండిమాల్ సిక్సర్ కొట్టాడు, అయితే, అది స్టేడియం దాటి బయటలకు వెళ్లింది. అలాగే ఆ బంతి రోడ్డుపై నడుస్తున్న ఓ బాలుడికి తగిలింది. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. సూపర్ సిక్సర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రోడ్డుపై పడ్డ బంతి..
179వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ వేసిన బంతిని దినేష్ చండిమాల్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదేశాడు. భారీ సిక్సర్ కావడంతో బంతి గాలే స్టేడియం వెలుపలికి వెళ్లింది. ఆ తర్వాత రోడ్డుపై స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడి పొట్టకు తగిలింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దినేష్ చండిమాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసేందుకు మిచెల్ స్టార్క్‌పై దాడి చేశాడు. చండిమాల్ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో శ్రీలంక 9 వికెట్లు పడ్డాయి. స్టార్క్ బంతికి వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టి తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.
Casually out for a stroll and get cleaned up by a six…
Should have kept the souvenir!
Some knock by Chandimal #SLvAUS pic.twitter.com/wMY1YYpuwU
— Andrew McCormack (@_AMcCormack7) July 11, 2022
చండిమాల్ రికార్డు..
ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్ దినేష్ చండిమాల్ కావడం విశేషం. ఈ ఆటగాడు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో హోబర్ట్ టెస్టులో సంగక్కర 192 పరుగులు చేయగా, ఇప్పుడు చండిమాల్ అతనిని అధిగమించాడు. చండిమాల్ డబుల్ సెంచరీతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 190 పరుగుల ఆధిక్యం సాధించింది. దిముత్ కరుణరత్నే 86, కుశాల్ మెండిస్ 85 పరుగులు చేశారు. ఏంజెలో మాథ్యూస్ 52, కమిందు మెండిస్ కూడా 61 పరుగులు చేశారు.