SRH vs LSG: అది ప్రపంచంలోనే బెస్ట్‌ పిచ్‌ అయితే.. ఇది వరల్డ్‌లోనే..! ఓటమి తర్వాత కమిన్స్‌ కామెంట్స్‌

లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. పాట్ కమిన్స్ ఉప్పల్ పిచ్‌ను ప్రశంసిస్తూ, లక్నో బ్యాటింగ్, బౌలింగ్‌ను కొనియాడాడు. రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో SRH బ్యాటింగ్ నిరాశపరిచిందని, ఒక బ్యాటర్ ఇన్నింగ్స్ చివరి వరకు నిలవలేకపోవడం ఓటమికి కారణమని అన్నాడు.

SRH vs LSG: అది ప్రపంచంలోనే బెస్ట్‌ పిచ్‌ అయితే.. ఇది వరల్డ్‌లోనే..! ఓటమి తర్వాత కమిన్స్‌ కామెంట్స్‌
Pat Cummins

Updated on: Mar 28, 2025 | 12:08 PM

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కాస్త నిరాశకు గురిచేసినట్లు ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్‌ చేసి, ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అతి పెద్ద స్కోర్‌ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌, సేమ్‌ గ్రౌండ్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌లో స్ట్రగుల్‌ అయింది. కేవలం 190 పరుగులకే పరిమితం అయింది. 190 అనేది టీ20ల్లో పెద్ద స్కోరే అయినప్పటికీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ లాస్ట్‌ సీజన్‌ నుంచి ఆడుతున్న అగ్రెసివ్‌ ఆటకు, బ్యాటింగ్‌ లైనప్‌కు, వాళ్లు సెట్‌ చేసిన స్టాడర్డ్స్‌కు ఇది చిన్న స్కోర్‌గా అనిపిస్తోంది. పైగా వాళ్లు ఇచ్చిన టార్గెట్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ కేవలం 16.1 ఓవర్లలోనే కొట్టేడయం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మన అడ్డాకు వచ్చి వాళ్లు పండగ చేసుకున్నట్లు ఉందని అంటున్నారు.

ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత ప్యాట్‌ కమిన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారని అన్నాడు. అలాగే రాజస్థాన్‌తో ఆడిన వికెట్‌, ఈ వికెట్‌ వేరు వేరని తెలిపాడు. ఈ పిచ్‌పై వేగంగా రన్స్‌ చేయాల్సిందని, కానీ, లక్నో నిజంగా బాగా బ్యాటింగ్ చేశారని పేర్కొన్నాడు. ఇప్పటికీ ఇది చాలా మంచి వికెట్, ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడిన పిచ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్‌ అయితే, ఇది రెండవ అత్యుత్తమ పిచ్‌ అని కొనియాడాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి వరకు ఓ బ్యాటర్‌ నిలిచి ఉండాలని, అది గత మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ చేశాడని అన్నాడు. సో.. ఈ మ్యాచ్‌లో అది మిస్‌ అయినట్లు కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు.

ఈ పిచ్‌పై లిటిల్‌ గ్రిప్‌ ఉందని, కానీ వాళ్లు చాలా బాగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేశారంటూ లక్నోను ప్రశంసించాడు. ఏది ఏమైనా.. ఇది కూడా చాలా మంచి పిచ్‌ అంటూ వెల్లడించాడు. కాగా, ఉప్పల్‌పై పిచ్‌పై ఇప్పటికే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పిచ్‌లతో బౌలర్లు రాణించలేరని, పూర్తిగా బ్యాటర్ల డామినేషన్‌ కొనసాగుతుందని చాలా మంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు. క్రికెట్‌ అంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమాన పోటీ ఉండాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది చాలా మంచి పిచ్‌ అంటూ కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..