Sophie Ecclestone: మహిళల క్రికెట్‌లో ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (Sophie Ecclestone) మరోసారి సత్తాచాటింది. అయితే ఎప్పుడూ బంతితో అద్భుతాలు చేసే ఈ ఇంగ్లిష్ క్రికెటర్ ఈసారి మాత్రం బ్యాట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సోఫీ కేవలం 12 బంతుల్లోనే 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి తన జట్టు విజయాన్ని ఖరారు చేసింది. ఎక్లెస్టోన్ చివరి ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు రాబట్టింది. తద్వారా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా చేతులెత్తేసింది. చివరకు 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ జట్టు బర్మింగ్‌హామ్ జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు సరిపడా ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.
ఆఖరి ఓవర్‌లో దంచుడే దంచుడు..
కాగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మసాబత్ క్లాస్‌పై సోఫీ ఎక్లెస్టోన్ విరుచుకుపడింది. క్లాస్ వేసిన చివరి ఓవర్ లో ఎక్లెస్టోన్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 26 పరుగులు రాబట్టింది. మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించిన సోఫీ మూడో బంతికి రెండు పరుగులు తీసింది. నాలుగో బంతికి నేరుగా స్టాండ్స్‌లోకి తరలించగా, ఐదో బంతిని బౌండరీగా మల్చింది. ఇక చివరి బంతికి సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించింది.19 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 150 పరుగులు మాత్రమే కాగా, నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 176 పరుగులకు చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు పూర్తిగా నిరాశపర్చారు. ముఖ్యంగా మసాబత్ క్లాస్ 4వ ఓవర్లో 62 పరుగులు సమర్పించుకుంది. ఇందులో ఏకంగా 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయాబొంగే ఖాకా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చింది.
బంతితోనూ..
దీని తర్వాత ఎక్లెస్టోన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. ఈ లెఫ్టార్మ్ నంబర్ 1 టీ20 బౌలర్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. తద్వారా తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆల్‌రౌండ్ ఫర్మామెన్స్‌తో ఆకట్టుకున్న ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. కాగా ఈ సిరీస్లో ఎక్లెస్టోన్ సిరీస్‌లో 5 వికెట్లు తీసింది. ఆమె ఎకానమీ రేటు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.
26 runs from the final over!
An entertaining cameo from @sophecc19 last night ? pic.twitter.com/pyRusOtVrk
— England Cricket (@englandcricket) July 26, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..