BCCI Fitness Test: బీసీసీఐ పరుగు పందెం పరీక్షలో ఆరుగురు ఆటగాళ్లు ఫెయిల్ .. వారిపై వేటు తప్పదా..?
BCCI’s Fitness Test: ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త ఫిట్‌నెస్
BCCI’s Fitness Test: ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త ఫిట్‌నెస్ టెస్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టాప్ ఆటగాళ్ల దేహదారుఢ్యం, వేగాన్ని కొలిచేందుకు రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్స్ టెస్ట్‌ను ప్రవేశ పెట్టింది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే ఈ నూతన టెస్ట్ గురించి ఆటగాళ్లకు తెలియజేసింది. కాంట్రాక్టు ఆటగాళ్లతో పాటు టీమిండియాలో చోటు కోసం శ్రమిస్తున్న క్రికెటర్లు ప్రస్తుతం ఉన్న యోయో టెస్ట్‌తో పాటు ఈ నూతన పరీక్షలోను నెగ్గాలి. కొత్త ప్రమాణాల ప్రకారం ఫాస్ట్ బౌలర్లు 8.15 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ అయితే 8.30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇక యోయో స్థాయిని ఎప్పటిలాగే 17.1గా ఉంది.
అయితే తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఆరుగురు భారత యువ ఆటగాళ్లకు ఈ పరీక్ష నిర్వహించగా అందరూ విఫలమైనట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్లు ఇషాన్ కిషాన్, సంజూ శాంసన్, బ్యాట్స్‌మన్ నితీష్ రాణా, లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా, పేసర్లు సిద్దార్థ్ కౌల్, జయదేవ్ ఉనాద్కత్‌లు ఈ రెండు కిలోమీటర్ల ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్‌తో అప్‌కమింగ్ టీ20, వన్డే సిరీస్‌ల్లో భాగంగా ఈ ఆరుగురికి ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరుగురికి కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఫిట్‌నెస్ నిర్వహించనున్నారని ఓ అధికారి తెలిపారు. ఈ పరీక్షలో కూడా వారు నెగ్గకపోతే ఇంగ్లండ్‌తో జరగనున్న అప్‌కమింగ్ టీ20, వన్డే సిరీస్‌ల్లో అవకాశం దక్కదన్నారు. ఇక ఈ రెండు కిలోమీటర్ల ఫిట్‌నెస్ టెస్ట్‌కు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో సహా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.